జీడిమెట్ల, వెలుగు: దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఏసీ పేలిపోవడంతో ఓ డూప్లెక్స్ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన రవి, దేవిజ్యోత్స్న దంపతులు నగరానికి వచ్చి మల్లంపేట్‌లోని డ్రీమ్‌వ్యాలీలో డూప్లెక్స్ ఇల్లు కొనుక్కొని నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎంసీబీలో షార్ట్‌సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. మంటల తీవ్రతకు ఏసీ పేలిపోవడంతో మంటలు వేగంగా ఇల్లంతా వ్యాపించాయి. దీంతో ఇంట్లోని ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో తాము కట్టుబట్టలతో మిగిలిపోయామని బాధితులు వాపోయారు.
బౌద్ధనగర్‌లో ఆటో దగ్ధం..
పద్మారావునగర్: హైదరాబాద్ బౌద్ధనగర్ డివిజన్ ఎల్‌ఎన్‌నగర్‌లో షార్ట్‌సర్క్యూట్ జరిగి ఓ ఆటో దగ్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం.. విద్యుత్ స్తంభానికి చుట్టుకుపోయిన ఇంటర్నెట్, టీవీ కేబుల్ వైర్ల కారణంగా బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో భారీ షార్ట్‌సర్క్యూట్ సంభవించింది. దీంతో వైర్లు మంటల్లో కాలిపోగా, పక్కనే నిలిపి ఉంచిన ఆంజనేయులుకు చెందిన కొత్త ఆటో అగ్నికి ఆహుతైంది. విద్యుత్ సిబ్బంది వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
