కాస్లాబాద్: రంగారెడ్డి జిల్లా చౌదర్‌గూడ మండలం కాస్లాబాద్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి యూకేజీ చదువుతున్న చిన్నారి సహస్ర మృతి చెందింది.
కాస్లాబాద్ గ్రామానికి చెందిన కృష్ణ–మనీషా దంపతుల కూతురు సహస్ర. స్థానిక అభ్యాస్ విద్యాపీఠం పాఠశాలలో నర్సరీ చదువుతోంది. ప్రతిరోజు లాగే ఉదయం స్కూల్ బస్సులో పాఠశాలకు వెళ్లిన చిన్నారి, సాయంత్రం ఇంటి దగ్గర బస్సు నుంచి దిగింది.
చిన్నారిని ఇంటి వద్ద దించిన అనంతరం డ్రైవర్ బస్సును వెనక్కి తీస్తున్న సమయంలో వాహనం వెనుక ఉన్న సహస్రను గమనించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని స్థానికులు వెంటనే షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
