బాలీవుడ్ నటి , సేక్రెడ్ గేమ్స్ ఫేమ్ రాజశ్రీ దేవ్ పాండే క్యాన్సర్ బారిన పడ్డారు. తనకు రొమ్ము క్యాన్సర్ సొకిందని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని వెల్లడించింది. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫోటోను షేర్ చేయడంతో సినీ వర్గాల్లో కలకలం రేగింది. అయితే ఈ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించినట్లు తెలిపారు.
రాజశ్రీ ఎమోషనల్
రాజశ్రీ తనకు ఎదురైన ఈ క్లిష్ట పరిస్థితిని వివరిస్తూ ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫోటోను షేర్ చేశారు. "నేను ఇన్‌ఫిల్టరేటింగ్ డక్టల్ కార్సినోమా అనే రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డాను. ప్రస్తుతం ఇది స్టేజ్-1లో ఉంది. నేను రొటీన్ చెకప్‌కు వెళ్లినప్పుడు ఊహించని విధంగా ఇది బయటపడింది. అదృష్టవశాత్తూ ప్రారంభ దశలోనే గుర్తించడంతో వైద్యులు వెంటనే శస్త్రచికిత్స నిర్వహించారు," అని ఆమె పేర్కొన్నారు. తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడానికి ఎంతో ధైర్యాన్ని కూడగట్టుకోవాల్సి వచ్చింది. ఆపరేషన్ తర్వాత వారి ముఖం చూడగానే తనలో ఉన్న భయం పోయి కొత్త శక్తి వచ్చిందని రాజశ్రీ ఎమోషనల్ అయ్యారు.
రోలర్ కోస్టర్ లాంటి ప్రయాణం
క్యాన్సర్ నిర్ధారణ అయినప్పటి నుండి లెక్కలేనన్ని టెస్టులు, సర్జరీలతో తన జీవితం ఒక రోలర్ కోస్టర్ రైడ్‌లా అనిపించిందని రాజశ్రీ దేవ్ పాండే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని, త్వరలోనే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆమె పోరాట పటిమను చూసిన పలువురు సెలబ్రిటీలు, అభిమానులు "నువ్వు చాలా స్ట్రాంగ్ లేడీవి.. త్వరగా కోలుకోవాలి" అంటూ కామెంట్లతో మద్దతు తెలుపుతున్నారు.
వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా..
2012లో అమీర్ ఖాన్ చిత్రం 'తలాష్'తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాజశ్రీ, వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. కిక్, మామ్, ద స్కై ఈజ్ పింక్, జోరం వంటి చిత్రాల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. నెట్‌ఫ్లిక్స్ సంచలనం 'సేక్రెడ్ గేమ్స్'లో సుభద్ర పాత్రతో ఆమె గ్లోబల్ వైడ్‌గా పాపులారిటీ దక్కించుకున్నారు. అలాగే 'ట్రయల్ బై ఫైర్' సిరీస్‌లో నీలం కృష్ణమూర్తిగా ఆమె చేసిన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
రాజశ్రీ కేవలం నటి మాత్రమే కాదు, 'నవభారత్' అనే ఎన్జీవో ద్వారా మహారాష్ట్రలోని కరువు పీడిత గ్రామాలకు నీటి సౌకర్యం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజశ్రీ త్వరగా కోలుకుని మళ్లీ వెండితెరపై మెరవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
