కరోనా మందుల బ్లాక్​మార్కెట్..డిమాండ్ ను బట్టి మందుకు లక్ష​

కరోనా మందుల బ్లాక్​మార్కెట్..డిమాండ్ ను బట్టి మందుకు లక్ష​

హైదరాబాద్​, వెలుగు: జనాల్లో ఉన్న కరోనా భయాన్ని ఓ మెడికల్​ గ్యాంగ్​ సొమ్ము చేసుకుంటోంది. కరోనా మందులను, టెస్టింగ్​ కిట్లను బ్లాక్​మార్కెట్​చేస్తూ లక్షల్లో కమీషన్లు దండుకుంటోంది. కస్టమర్ల పేరుతో డెకాయ్​ ఆపరేషన్​ చేసిన టాస్క్​ఫోర్స్​ పోలీసులు ఆ గ్యాంగ్​ ఆటకట్టించారు. ఎనిమిది మందిని అరెస్ట్​ చేశారు. రెమ్డెసివిర్​, ఫావిపిరావిర్​ సహా రూ.35.5 లక్షల విలువ చేసే యాంటీ వైరల్​ మందులు, 55 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను సీపీ అంజనీకుమార్​ మంగళవారం వెల్లడించారు.

వాట్సాప్​లో ‘షార్టేజ్​’ దందా

సికింద్రాబాద్​కు చెందిన కె. వెంకట సుబ్రహ్మణ్యం (36) మల్కాజిగిరి ఆనంద్​బాగ్​లో ‘శ్రీ మెడిక్యూర్​ ప్రొడక్ట్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​’ పేరిట మెడికల్​ ఏజెన్సీ నడుపుతున్నాడు. హెటిరో తయారు చేసిన కరోనా మందు రెమ్డెసివిర్​కు డిస్ట్రిట్యూటర్​గా ఉన్నాడు. దాంతో పాటు ఫాబిఫ్లూ (ఫావిపిరావిర్​)నూ సప్లై చేస్తున్నాడు. కరోనా భయాన్నే అలుసుగా తీసుకున్న సుబ్రహ్మణ్యం ఎమర్జెన్సీలో వాడే ఆ కరోనా మందులతో పాటు ఆక్టెమ్రా (టొసిలిజుమాబ్​) ఇంజెక్షన్లు, కరోనా టెస్టింగ్​ కిట్లనూ బ్లాక్​ మార్కెట్​లో అమ్ముకోవాలని ప్లాన్​ వేశాడు. ఆ మందులను షార్టేజ్​ లిస్టులో పెట్టి బ్లాక్​మార్కెట్​లోకి పంపాడు. అందుకోసం వాట్సాప్​ గ్రూప్​ను క్రియేట్​ చేసి వాటి రేట్​, డిమాండ్​ను షేర్​ చేసేవాడు. బ్లాక్​మార్కెట్​ దందా అంతా ఆ గ్రూప్​ నుంచే చేసేవాడు.

చెయిన్​ సిస్టమ్​

బ్లాక్​మార్కెట్​ దందా కోసం ఓ పెద్ద చెయిన్​ సిస్టమ్​నే ఏర్పాటు చేశాడు వెంకట సుబ్రహ్మణ్యం. ఢిల్లీకి చెందిన గగన్​ అగర్వాల్​ అనే వ్యక్తితో కలిసి మందులు, టెస్ట్​ కిట్లను బ్లాక్​ చేశాడు. హాస్పిటళ్లు, మెడికల్​ షాపులకు వెళ్లాల్సిన మందులను హైదరాబాద్​ నారాయణగూడకు చెందిన రాహుల్​ అగర్వాల్​ (29) అనే వ్యక్తికి పంపించేవాడు. సిటీ ఆస్పత్రుల్లోని ఫార్మసీల్లో షార్టేజ్​ మందుల వివరాలను మెడికల్​ రిప్రజెంటేటివ్స్​ ద్వారా తెలుసుకునేవాడు. తర్వాత ఆ కరోనా మందులను ఫీల్​ఖానాకు చెందిన మెడికల్​ ఏజెంట్​ మహ్మద్​ షఖీర్​ (34), ముషీరాబాద్​కు చెందిన కె. కిశోర్​ (29), సంతోష్​ కుమార్​ (39), తలాబ్​కట్టకు చెందిన సైఫ్​ అలీ మహ్మద్​ (22), సైదాబాద్​కు చెందిన ఫిర్దోస్​ మహ్మద్​ (26) గ్యాంగ్​తో కలిసి బ్లాక్​మార్కెట్​లో అమ్మేవాడు.

డిమాండ్​ను బట్టి మందుకు లక్ష

సంతోష్​, కిశోర్​, మహ్మద్​ షఖీర్​ల నుంచి రాహుల్, ఫిర్దోస్​లు రూ. 8 వేల చొప్పున కమీషన్​కు కరోనా మందులను కొనేవారు. డిమాండ్​ను బట్టి రూ.15 వేల నుంచి రూ.18 వేల కమీషన్​తో మందులను కస్టమర్లకు అమ్మేవాళ్లు. రూ.5,400 విలువ చేసే రెమ్డెసివిర్​ను రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు రేటు పెంచి సొమ్ము చేసుకున్నారు. రూ.40 వేలు విలువ చేసే ఆక్టెమ్రా ఇంజెక్షన్​ను రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకూ అమ్మేటోళ్లు. ఇటు ఫాబిఫ్లూ, కరోనా టెస్టింగ్​ కిట్లకూ రూ.వేలల్లో ధరలు పెంచి బ్లాక్​మార్కెట్​ దందా చేశారు. ఈ దందాపై సమాచారం అందుకున్న హైదరాబాద్​ సౌత్​జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు కస్టమర్ల పేరిట డెకాయ్​ ఆపరేషన్​ చేశారు. అన్ని విషయాలూ రాబట్టి మొత్తం 8 మందిని అరెస్ట్​ చేశారు.