బీఎల్వో స్థాయి సమావేశాలు.. నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్

బీఎల్వో స్థాయి సమావేశాలు.. నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్

నల్గొండ, వెలుగు: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా చనిపోయిన, శాశ్వతంగా చిరునామా మారిన, గైర్హాజరైన ఓటర్ల వివరాల క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఆగస్టు 1, 2 తేదీల్లో నిర్వహించే బీఎల్వో స్థాయి సమావేశాలకు రాజకీయ పార్టీల బీఎల్ఏలు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ కోరారు.

శుక్రవారం నల్గొండ కలెక్టరేట్ లో రాజకీయ పక్షాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రతిపాదనలు పంపి, ఆగస్టు 10న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం జిల్లాలో 1,812 పోలింగ్ కేంద్రాలు ఉండగా, నిబంధనల ప్రకారం గరిష్ఠంగా 1,200 మంది ఓటర్లకు ఒక కేంద్రం చొప్పున హేతుబద్ధీకరణ చేపట్టి, కొత్తగా 42 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుతో పాటు 30 కేంద్రాల లొకేషన్ మార్పు, 8 కేంద్రాల పేర్ల మార్పునకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ  ఆగస్టు 3 నాటికి ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తవుతుందని, చనిపోయిన, చిరునామా మారిన ఓటర్లకు నోటీసులు జారీ చేసి, బీఎల్ఏల సమక్షంలో పరిశీలించిన తర్వాతే పేర్లు తొలగిస్తామని తెలిపారు. 

ముద్ర రుణాలను సద్వినియోగం చేసుకోవాలి 
నల్గొండ జిల్లాలోని చేనేత కళాకారులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్ర రుణాలను సద్వినియోగం చేసుకుని, స్వయం ఉపాధిని విస్తరించి ఆర్థికంగా బలోపేతం కావాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ లో సమావేశ మందిరంలో చేనేత కళాకారులకు నిర్వహించిన ముద్ర రుణాల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

చేనేత రంగానికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, అర్హులైన కార్మికులు రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు లభించే ఈ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారుల సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించి పరిష్కరిస్తామని హామీనిచ్చారు.