గూగుల్ సెర్చ్‌‌తో జర కేర్‌‌ఫుల్

గూగుల్ సెర్చ్‌‌తో జర కేర్‌‌ఫుల్

ఒరిజినల్స్‌‌ లాగే ఫేక్‌‌ వెబ్​సైట్లు

కస్టమర్‌‌ సర్వీస్‌‌ పేరుతో మోసాలు

కంప్లైంట్‌‌ తీస్కొని డబ్బు వాపస్‌‌ జేస్తమంటరు

అకౌంట్‌‌ వివరాలడిగి క్షణాల్లో పైసలు గుంజేస్తరు

ఈమధ్య జొమాటో ఫేక్‌‌  కస్టమర్‌‌ కేర్‌‌కు ఒకాయన ఫోన్‌‌  

రూ. 200 కోసం కంప్లైంట్‌‌ చేస్తే రూ.75 వేలు మాయం

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఆర్డర్‌‌‌‌ జేసిన సామాను సక్కగ రాలేదా? కంప్లైంట్‌‌‌‌ చేయనింకే కస్టమర్‌‌‌‌ కేర్‌‌‌‌ నంబర్‌‌‌‌ కోసం గూగుల్‌‌‌‌లో వెతుకుతున్నరా? అయితే జర పైలం. అచ్చం ఒరిజినల్‌‌‌‌ సైట్లలాగనే వెబ్‌‌‌‌సైట్లు వెట్టి కస్టమర్‌‌‌‌ కేరోళ్లమంటూ అందిన కాడికి దోచుకునే సైబర్‌‌‌‌ దొంగలు ఎక్కువైన్రు. కట్టిన పైసలు రీ ఫండ్‌‌‌‌ అవడం గాదు. అకౌంట్ల ఉన్న పైసలు ఖాళీ చేస్తున్నరు. కొంచెం అలుసిచ్చినా ఉన్నదంతా ఊడ్చేస్తున్నరు. ఇట్లనే ఈమధ్య ఒకాయన రూ. 200 రీఫండ్‌‌‌‌ కోసం జొమాటో ఫేక్‌‌‌‌ కస్టమర్‌‌‌‌ కేర్‌‌‌‌ నంబర్‌‌‌‌కు ఫోన్‌‌‌‌ జేసి రూ. 75 వేలు పోగొట్టుకున్నడు.

గూగుల్‌‌‌‌లో వెతికి చూసి..

హైదరాబాద్‌‌‌‌లోని అల్వాల్‌‌‌‌కు చెందిన నరసింహమూర్తి ఆర్మీ ఎంప్లాయ్‌‌‌‌. మొబైల్ వాలెట్స్‌‌‌‌తో రెగ్యులర్‌‌‌‌గా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాడు. ఎప్పటిలాగానే ఈమధ్యన రూ. 200 స్వీట్స్‌‌‌‌ను జొమాటో నుంచి ఆర్డర్ చేశాడు. అరగంటలోనే స్వీట్స్ వచ్చాయి. పార్సిల్‌‌‌‌ను ఓపెన్ చేసి చూశాడు. స్వీట్స్ చెడు వాసన వచ్చాయి. దీంతో పార్సిల్‌‌‌‌ను రిటర్న్ చేసి డబ్బు వెనక్కి తీసుకోవడానికి కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్‌‌‌‌లో వెతికాడు. జొమాటో కస్టమర్ కేర్ పేరుతో ఉన్న వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో 9330017233 నంబర్‌‌‌‌ను చూశాడు.

అచ్చం ఒరిజినల్‌‌‌‌ సైట్‌‌‌‌లానే..

జొమాటో వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లానే ఉన్న సైట్‌‌‌‌లో కనిపించిన ఫేక్ కస్టమర్ కేర్ నంబర్‌‌‌‌కు నరసింహమూర్తి ఫోన్‌‌‌‌ చేశాడు. జొమాటో కస్టమర్‌‌‌‌ కేర్‌‌‌‌ ప్రతినిధిగా ఓ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. నరసింహమూర్తి మాట్లాడుతూ.. తనకు డెలివరీ అయిన స్వీట్స్ చెడు వాసన వస్తున్నాయని, ఆర్డర్ క్యాన్సిల్ చేస్తానని, డబ్బు తిరిగిచ్చేయమని చెప్పాడు. అవతలి వ్యక్తి రూ.200 తప్పకుండా రీఫండ్ చేస్తామని నమ్మించాడు. బ్యాంక్ అకౌంట్, యుపీఐ, నెట్ బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీ నంబర్లను చెప్పాలని కోరాడు.

అడిగింది అడిగినట్టు చెప్పి..

అతను అడినట్టే బ్యాంకు ఖాతా వివరాలను నరసింహమూర్తి చెప్పాడు. తర్వాత ఎనీ డెస్క్‌‌‌‌ యాప్‌‌‌‌ను ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌ చేసుకోమని అవతలి వ్యక్తి చెప్పాడు. మూర్తి ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌ చేసుకోగానే ఫోన్‌‌‌‌ పే ఓపెన్‌‌‌‌ చేయమన్నాడు. అతను అలా ఓపెన్‌‌‌‌ చేశాడో లేదో.. ఇలా రూ.74,800 అకౌంట్‌‌‌‌ నుంచి మాయమైపోయాయి. కంగారు పడిన వసంత్‌‌‌‌ మరోసారి అదే కస్టమర్ కేర్ నంబర్‌‌‌‌కు ఫోన్‌‌‌‌ చేశాడు. ఫోన్‌‌‌‌ స్విచ్చాఫ్‌‌‌‌ అని వచ్చింది. మరోసారి కాల్‌‌‌‌ చేశాడు. అదే జవాబు. తర్వాత మళ్లీ గూగుల్‌‌‌‌లో వెతికి ఒరిజినల్‌‌‌‌ కస్టమర్‌‌‌‌ కేర్‌‌‌‌కు ఫోన్‌‌‌‌ చేయడంతో విషయం అర్థమైంది. ఇంతకుముందు గూగుల్‌‌‌‌లో చూసింది ఫేక్ కస్టమర్ కేర్ నంబరని తెలుసుకున్నాడు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నకిలీ సైట్లు మస్తుగున్నయ్‌‌‌‌

గూగుల్ సెర్చ్‌‌‌‌లో ఇలాంటి నకిలీ వెబ్‌‌‌‌సైట్లు చాలా ఉన్నాయి. ఫేక్ కస్టమర్ కేర్ నంబర్లు, ఆఫర్లతో జనాలను సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేస్తున్నారు. ఇట్లాంటి కేసులు ప్రతి నెలా 10 నుంచి 15 నమోదవుతున్నాయి. నెటిజన్లు అప్రమత్తంగా ఉండాలి. టోల్ ఫ్రీ నంబర్లు, కస్టమర్ కేర్ సెంటర్లకు ఫోన్‌‌‌‌ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్, ఓటీపీ వివరాలివ్వొద్దు.

‑ సైబర్‌‌‌‌ క్రైమ్‌‌‌‌ పోలీసులు

వెలుగు మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి