ట్రేడింగ్ పేరిట రూ. 14 లక్షలు కొట్టేశారు

ట్రేడింగ్ పేరిట రూ. 14 లక్షలు కొట్టేశారు
  • ప్రభుత్వ ఇంజనీర్‌‌ ను మోసగించిన సైబర్ క్రిమినల్స్  

బషీర్ బాగ్, వెలుగు : స్టాక్‌‌ మార్కెట్‌‌ ట్రేడింగ్‌‌లో ఇన్వెస్ట్ మెంట్ చేస్తే భారీగా లాభాలు వస్తాయని  ఓ ఇంజనీర్‌‌ను నమ్మించి రూ. లక్షల్లో సైబర్‌‌ క్రిమినల్స్ కొట్టేశారు. హైదరాబాద్ సైబర్‌‌ క్రైమ్‌‌ ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం.. సిటీకి చెందిన ప్రభుత్వ ఇంజనీర్‌‌ (41)కు స్టాక్ వాన్ గార్డ్‌‌ కంపెనీ కస్టమర్‌‌ సర్వీస్‌‌ ప్రతినిధి పేరుతో సైబర్‌‌ క్రిమినల్స్ వాట్సాప్‌‌ కాల్‌‌ చేశారు. అతడి ఫోన్ నంబర్ ను స్టాక్‌‌ మార్కెట్‌‌ టిప్స్‌‌ వాట్సాప్‌‌ గ్రూప్‌‌లో యాడ్‌‌ చేశారు. గ్రూప్‌‌ సభ్యుల పేరుతో ట్రేడింగ్‌‌ చేస్తే  లాభాలు వచ్చినట్లు బ్యాంక్‌‌ స్టేట్‌‌మెంట్లు గ్రూప్‌‌లో పోస్ట్ చేస్తూ నమ్మించారు.

స్టాక్‌‌ మార్కెట్‌‌ వెబ్‌‌ సైట్‌‌ పేరిట ఎలైస్‌‌ డి2 పేరుతో ఓ నకిలీ ట్రేడింగ్‌‌ యాప్‌‌ను లింక్‌‌ ను బాధితుడికి పంపించి మొబైల్‌‌లో ఇన్‌‌స్టాల్‌‌ చేయించారు. అనంతరం ఐపీవో సబ్‌‌స్క్రిప్షన్‌‌ తీసుకోవాలని సూచించారు.  యాప్‌‌లో షేర్లు కేటాయించినట్లు చూపించారు. ఐపీవో లిస్టింగ్‌‌ తేదీ సమీపిస్తుందని డబ్బు డిపాజిట్‌‌ చేయమని తెలిపారు. వోడాఫోన్‌‌ ఎఫ్‌‌పీఓ, క్రియేటివ్‌‌ గ్రాఫిక్స్‌‌ సొల్యూషన్ షేర్లు కేటాయించినట్లు యాప్‌‌లో చూపించారు.

విడతల వారీగా ఇంజనీర్‌‌ ఇంటర్నెట్‌‌ బ్యాంకింగ్‌‌ ద్వారా రూ.14,18,000 ట్రాన్స్‌‌ఫర్‌‌ చేశాడు. 3 రోజుల అనంతరం బాధితుడి మొబైల్‌‌ నుంచి ట్రేడింగ్‌‌ యాప్‌‌ డిలీట్‌‌ అవడంతో పాటు వాట్సాప్‌‌ గ్రూప్‌‌ నుంచి తొలగించారు. మోసపోయిన బాధితుడు సైబర్‌‌ క్రైమ్‌‌ పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శివ మారుతి తెలిపారు.

ఓ వ్యాపారి వద్ద  రూ. 1.22 లక్షలు.. 

హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారి పేరుపై నిషేధిత వస్తువులు కొరియర్ లో పార్సిల్ అవుతున్నాయంటూ సైబర్ క్రిమినల్స్ మోసానికి పాల్పడ్డారు. సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం... సిటీకి చెందిన ఓ వ్యాపారికి ముంబై ఫెడెక్స్ కొరియర్ ఆఫీసు  అంటూ వాట్సప్ కాల్ వచ్చింది. అతడి పేరిట ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి తైవాన్ కు ఓ పార్సిల్  వెళ్తుందని, అందులో నిషేధిత వస్తువులు ఉన్నట్టు తెలిపారు. అనంతరం ముంబై సైబర్ క్రైమ్ అధికారి అంటూ సైబర్ క్రిమినల్స్ టెలిగ్రామ్ నుంచి వీడియో కాల్ చేశారు. అడ్రస్ వెరిఫై కోసం బాధితుడి ఆధార్ కార్డ్ ను చూపించాలని కోరారు.

అతను హవాలా, మనీ లాండరింగ్ , మాదకద్రవ్యాలు అక్రమ రవాణా పాల్పడుతున్నట్లు, కేసు నమోదు చేసి జైలుకు తరలిస్తామని అవతలి వ్యక్తులు వ్యాపారిని బెదిరించారు. కేసు నుంచి బయటపడాలంటే... పార్సిల్ అయ్యే  వాటిపై 90 శాతం మొత్తాన్ని పన్నుగా చెల్లించాలని సూచించారు. దీనితో భయపడిన బాధితుడు వారు సూచించిన అకౌంట్ కు రూ. 1,22,934  ట్రాన్స్ ఫర్ చేశాడు. అనంతరం మోసపోయానని తెలుసుకుని బాధితుడు ఆన్ లైన్ లో సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసినట్టు ఏసీపీ శివమారుతి తెలిపారు.