న్యూఢిల్లీ: పొరుగు దేశం బంగ్లాదేశ్‌తో భారత్‌కు సంబంధాలు క్షీణిస్తున్నాయి. స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హాదీ కాల్చివేత ఆ తర్వాత హిందూ యువకుడిని దారుణంగా హత్య చేయడంతో బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగాయి. బంగ్లాదేశ్ వ్యాప్తంగా భారత వ్యతిరేక నిరసనలు తీవ్రమయ్యాయి. బంగ్లాలోని భారత హైకమిషన్ కార్యాలయంపై దాడులు జరిగాయి. దీంతో అప్రమత్తమైన భారత ప్రభుత్వం చటోగ్రామ్‌లోని ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ (IVAC)ను క్లోజ్ చేసింది.
తాత్కాలికంగా బంగ్లాదేశ్ పౌరులకు వీసా జారీ సేవలను నిలిపివేసింది. ఈ నిర్ణయం వెలువడిన 24 గంటల్లోనే బంగ్లా కూడా ఇండియా బాటలోనే పయనించింది. భారతీయులకు తాత్కాలికంగా వీసా సేవలు నిలిపివేసింది. ‘‘తప్పనిసరి పరిస్థితుల్లో ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ నుంచి అన్ని కాన్సులర్, వీసా సేవలను తదుపరి నోటీసు వచ్చేవరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం’’ అని బంగ్లాదేశ్ హైకమిషన్ సోమవారం (డిసెంబర్ 22) వెల్లడించింది. వీసా ఇంటర్వ్యూల కోసం స్లాట్ లు బుక్ చేసుకున్న అభ్యర్థులకు తర్వాత స్లాట్ లు కేటాయిస్తామని పేర్కొంది. ఏదైనా అసౌకర్యం కలిగితే హృదయపూర్వకంగా చింతిస్తున్నామని పేర్కొంది.
బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించడం, అక్కడి నేతల విధ్వేషపూరిత ప్రసంగాల నేపథ్యంలో ఢాకాలోని భారత వీసా అప్లికేషన్ సెంటర్ (ఐవీఏసీ)ను ఇండియన్ గవర్నమెంట్ మూసివేసిన విషయం తెలిసిందే. స్థానికంగా జరుగుతున్న యాంటీ ఇండియా ఉద్యమం, ఎంబసీకి బెదిరింపుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి.
ఈమేరకు వీసా అప్లికేషన్ సెంటర్ ఓ ప్రకటన విడుదల చేస్తూ.. బుధవారం మధ్యాహ్నం నుంచి ఢాకాలోని జమునా ఫ్యూచర్ పార్క్ సమీపంలోని వీసా సెంటర్ ను మూసేసినట్లు తెలిపింది. వీసా ఇంటర్వ్యూల కోసం స్లాట్ లు బుక్ చేసుకున్న అభ్యర్థులకు తర్వాత స్లాట్ లు కేటాయిస్తామని పేర్కొంది. కాగా, బంగ్లాదేశ్ వ్యాప్తంగా మొత్తం 16 భారత వీసా కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ఏటా 22 లక్షల వీసాలను ప్రాసెస్ చేస్తామని అధికారులు తెలిపారు.
