ఆస్ట్రేలియాలోనూ అంబానీ దూకుడు.. ప్రముఖ బెవరేజ్ కంపెనీని చేజిక్కించుకున్న రిలయన్స్..

ఆస్ట్రేలియాలోనూ అంబానీ దూకుడు.. ప్రముఖ బెవరేజ్ కంపెనీని చేజిక్కించుకున్న రిలయన్స్..

ఒకప్పుడు కేవలం ఆయిల్ బిజినెస్ మాత్రమే ఫోకస్ చేసిన అనిల్  అంబానీ.. ఆ తర్వాత రిటైల్ వ్యాపారాన్ని భారీగా గ్రో చేశారు. ఆ తర్వాత టెలికాం రంగంలో సంచలనం సృష్టించి.. ప్రస్తుతం శీతలపానీయాల రంగంపై ఫోకస్ కొనసాగిస్తున్నారు. క్యాంపా కొనుగోలు సక్సెస్ తర్వాత ముఖేష్ అంబానీ ఈ రంగంలో మరిన్ని కంపెనీలను కొనుగోలు చేస్తూ దేశీయ మార్కెట్లోనే కాకుండా అనేక దేశాలకు తన వ్యాపారాన్ని విస్తరించారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాకు చెందిన మరో కంపెనీ కూడా అంబానీ గుప్పిట్లోకి వచ్చేసింది. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గ్లోబల్ మార్కెట్లలో తన సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరిస్తున్నారు. తాజాగా రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ బెవరేజ్ కంపెనీ గుడ్‌నెస్ గ్రూప్ గ్లోబల్ లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసి గ్లోబల్ FMCG రంగంలో ప్రకంపనలు సృష్టించింది. ఈ ఒప్పందంతో రిలయన్స్ తొలిసారిగా ఆస్ట్రేలియా వినియోగదారుల మార్కెట్లోకి అధికారికంగా అడుగుపెట్టింది. అంబానీ పెట్టుబడుల దూకుడు కేవలం దేశీయ మార్కెట్‌కే పరిమితం కాలేదు. ప్రపంచ స్థాయి బ్రాండ్‌లను కైవసం చేసుకోవడమే లక్ష్యమని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.

Also Read :  అమెరికాలో 'జీరో డ్యూటీ'తో భారతీయ రైతులకు పండగే..!

ఈ కొనుగోలు ద్వారా గుడ్‌నెస్ గ్రూప్‌నకు చెందిన నెక్స్‌బా (Nexba), పేస్ (PACE) లాంటి హెల్త్ డ్రింక్ బ్రాండ్లు ఇప్పుడు రిలయన్స్ చేతికి వచ్చాయి. ముఖ్యంగా 'పేస్' బ్రాండ్ ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ పాట్ కమిన్స్‌తో కలిసి రూపొందించిన హైడ్రేషన్ డ్రింక్ కావడం గమనార్హం. ఆరోగ్యం పట్ల స్పృహ కలిగిన నేటి తరం వినియోగదారులను ఆకర్షించేలా తక్కువ చక్కెర, ప్లాంట్ బేస్డ్ స్వీటెనర్లతో తయారయ్యే గట్-హెల్త్ పానీయాలపై రిలయన్స్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ బ్రాండ్లను త్వరలోనే భారత మార్కెట్లోకి కూడా తీసుకురావాలని రిలయన్స్ భావిస్తోంది.

సిడ్నీ కేంద్రంగా పనిచేసే గుడ్‌నెస్ గ్రూప్ ఇప్పటికే ఆస్ట్రేలియాతో పాటు మరో 20 అంతర్జాతీయ మార్కెట్లలో వ్యాపారం కొనసాగిస్తోంది. ఇప్పుడు రిలయన్స్ అండ లభించడంతో ఈ బ్రాండ్ల విస్తరణ మరింత వేగవంతం కానుంది. అంబానీ గతంలోనే యూఏఈ, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో ఎఫ్ఎంసీజీ కార్యకలాపాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆస్ట్రేలియా డీల్‌తో పసిఫిక్ రీజియన్‌లోనూ పట్టు సాధించారు. ప్యాకేజ్డ్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ విభాగంలో గ్లోబల్ లీడర్‌గా ఎదగాలన్న రిలయన్స్ వ్యూహం ఈ పెట్టుబడితో మరో మెట్టు పైకి చేరుకుందని నిపుణులు చెబుతున్నారు. 

Also Read : బెంగళూరు ఆటోవాలలపై ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ ఫైర్

అంతర్జాతీయ బ్రాండ్లను దేశీయ మార్కెట్‌కు తీసుకురావడమే కాకుండా.. విదేశీ గడ్డపై నేరుగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడం ముకేశ్ అంబానీ కొత్త వ్యూహంగా కనిపిస్తోందని వారు అంటున్నారు. హెల్తీ డ్రింక్స్ విభాగంలో ఉన్న డిమాండ్‌ను అందిపుచ్చుకుంటూ.. గ్లోబల్ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రిలయన్స్ సిద్ధమవుతోందని ఇది రుజువు చేస్తోంది.