పాక్ ద్వంద్వ నీతిపై ఎంపీ ఫజ్లూర్ రెహ్మాన్ ఫైర్.. ఉగ్ర క్యాంపులపై భారత దాడి రైటే..

పాక్ ద్వంద్వ నీతిపై ఎంపీ ఫజ్లూర్ రెహ్మాన్ ఫైర్.. ఉగ్ర క్యాంపులపై భారత దాడి రైటే..

పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక విధానాల్లోని డొల్లతనాన్ని ఆ దేశానికే చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం(JUI-F) చీఫ్ మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ బయటపెట్టారు. అఫ్గానిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై పాక్ దాడులు చేయడాన్ని సమర్థించుకుంటూ, భారత్.. పాక్ లోని ఉగ్రవాద కేంద్రాలపై దాడులు చేస్తే మాత్రం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోందంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పాక్ ముఖంపై చెంపపెట్టుగా మారాయి.

ఈ ఏడాది భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' అంశాన్ని ప్రస్తావిస్తూ రెహ్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మే 7న పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ చర్యను పాకిస్థాన్ తీవ్రంగా ఖండించి. దీనిని యుద్ధ ప్రకటనగా అభివర్ణించింది. అయితేతన సొంత దేశంలోని బహావల్పూర్, మురిద్కే వంటి ప్రాంతాల్లో ఉగ్రవాద కేంద్రాలు ఉన్నాయని, భారత్ వాటిని లక్ష్యం చేసుకోవడంలో తప్పేముందని రెహ్మాన్ ప్రశ్నించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.

టీటీపీ ఉగ్రవాదులు అఫ్గానిస్థాన్‌లో తలదాచుకుంటున్నారనే సాకుతో పాక్ సరిహద్దులు దాటి దాడులు చేస్తోందని రెహ్మాన్ వాదన. మరి అదే సూత్రాన్ని భారత్ పాటిస్తే పాక్ ఎందుకు గగ్గోలు పెడుతోందని నిలదీశారు. ఇది ఇస్లామాబాద్ అనుసరిస్తున్న ద్వంద్వ నీతికి పరాకాష్ట అని విమర్శించారు. భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' కేవలం ఉగ్రవాద వ్యతిరేక చర్యేనని, అది తమ దేశ రక్షణ కోసం తీసుకున్న నిర్ణయమని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.

ALSO READ : బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి..

మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ చేసిన వ్యాఖ్యలు భారత దౌత్యపరమైన వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతున్నాయనేది నగ్న సత్యమని, వాటిని అణచివేసేందుకు భారత్ చేసే దాడులు సబబేనని పరోక్షంగా పాక్ ఎంపీనే అంగీకరించినట్లయింది. పొరుగు దేశాలతో నిరంతరం ఘర్షణ వైఖరిని అవలంబిస్తూ, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ వైఖరి వల్ల ఆ దేశం అంతర్జాతీయంగా ఒంటరి అవుతోందని ఆయన మాటల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. మెుత్తానికి ఆఫ్గన్ పై దాడులు సరైనవి అన్నప్పుడు భారత దాడి కూడా కరెక్ట్ అన్నారు పాకిస్థాన్ ఎంపీ.