షార్ట్ సర్క్యూటే కారణం.. నాంపల్లి FSL కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

షార్ట్ సర్క్యూటే కారణం.. నాంపల్లి FSL కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

హైదరాబాద్: నాంపల్లి FSL కార్యాలయంలో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు ఫైర్ డీజీ విక్రమ్‌సింగ్ మాన్ తెలిపారు. శనివారం (ఫిబ్రవరి 7) నాంపల్లి FSL కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ నారాయణతో కలిసి ఘటన స్థలాన్ని విక్రమ్ సింగ్ మాన్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆయన ఆరా తీశారు. 

ఈ సందర్భంగా విక్రమ్ సింగ్ మాన్ మాట్లాడుతూ.. శనివారం (ఫిబ్రవరి 7) ఉదయం 10.20 గంటలకు ఎఫ్ఎస్ఎల్‎లో అగ్నిప్రమాదం సంభవించినట్లు కాల్ వచ్చిందని తెలిపారు. వెంటనే అసెంబ్లీ దగ్గర ఉన్న ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తీసుకొచ్చామన్నారు. ఎఫ్‎ఎస్‎ఎల్ కార్యాలయం ఫస్ట్ ఫ్లోర్లో ఎంసీబీ దగ్గర ఉన్న స్విచ్ బోర్డులో ఫైర్ సంభవించినట్లు అనుమానిస్తున్నామని.. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారిస్తున్నామని చెప్పారు. 

ALSO READ : కుత్బుల్లాపూర్‎లో మహిళా ఫిజియో డాక్టర్ ఆత్మహత్య

ల్యాబ్‎లో ఉన్న కంప్యూటర్స్, హార్డ్ డిస్క్‎లు కాలిపోయాయని తెలిపారు. ఈ ఘటనతో ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఫైర్ సేఫ్టీ తనిఖీలు చేస్తామన్నారు. ఎండాకాలం వస్తుండటంతో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని.. కాబట్టి అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉన్నామన్నారు. నగరంలోని రెసిడెన్షియల్, కమర్షియల్, ప్రభుత్వ కార్యాలయాలలో ఫైర్ టీమ్స్ తనిఖీలు చేపడుతుందని తెలిపారు.