Ram Gopal Varma: "నీ నీతులు నీ ఇంట్లోనే చెప్పుకో.." - శివాజీపై విరుచుకుపడ్డ రామ్ గోపాల్ వర్మ!

Ram Gopal Varma: "నీ నీతులు నీ ఇంట్లోనే చెప్పుకో.." - శివాజీపై విరుచుకుపడ్డ రామ్ గోపాల్ వర్మ!

‘దండోరా’ సినిమా ఈవెంట్‌లో నటుడు శివాజీ..  హీరోయిన్ల బట్టలపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. ఇప్పటికే సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ,  హీరో మంచు మనోజ్ వంటి వారు శివాజీకి గట్టి కౌంటర్లు ఇచ్చారు.  లేటెస్ట్ గా ఈ ' వస్త్రధారణ ' వివాదంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) రంగంలోకి దిగారు. తనదైన శైలిలో శివాజీపై విరుచుకుపడుతూ ఆర్జీవీ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

నీ నీతులు నీ ఇంట్లోనే చెప్పుకో..

సాధారణంగానే ఎవరైనా నైతికత (Morality) గురించి మాట్లాడితే ఆర్జీవీకి ఒళ్లు మండుతుంది. ఇక శివాజీ మహిళల డ్రెస్సింగ్ సెన్స్‌ను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలపై వర్మ ఊరుకుంటారా? ఎక్స్ వేదికగా శివాజీపై సీరియస్ అయ్యారు.  చెంపదెబ్బ లాంటి సమాధానం ఇచ్చారు.  ప్రస్తుతం ఆర్జీవీ పోస్ట్ వైరల్ అవుతోంది.

"ఆ వెధవ పూర్తి పేరు కూడా నాకు తెలియదు.. అందుకే ఇక్కడ కామెంట్ చేస్తున్నాను" అంటూ మొదలుపెట్టిన వర్మ.. అత్యంత కటువైన పదజాలంతో దాడి చేశారు. "హేయ్ శివాజీ.. నువ్వు ఎవరివైనా, ఎలాంటి వాడివైనా నాకు అనవసరం. నీలాంటి ఒక అసభ్యకరమైన, పద్ధతి లేని వ్యక్తిని నీ ఇంట్లో ఆడవాళ్లు భరిస్తున్నారు కాబట్టి.. వెళ్లి నీ నీతులు వాళ్లకే చెప్పుకో. అంతేకానీ సమాజంలో ఉన్న మహిళలపై గానీ, చిత్ర పరిశ్రమలో ఉండేవారిపై గానీ నీ చెత్త అభిప్రాయాలను రుద్దకు. నీ అభిప్రాయాలను ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకో" అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

అసలేం జరిగిందంటే?

హైదరాబాద్‌లో జరిగిన ‘దండోరా’ సినిమా వేడుకలో శివాజీ మాట్లాడుతూ.. నేటితరం హీరోయిన్ల గ్లామర్ ప్రదర్శనపై విరుచుకుపడ్డారు. స్త్రీ అందం చీరకట్టులోనే ఉంటుందని చెబుతూనే, పొట్టి బట్టలు వేసుకునే వారిని ఉద్దేశించి అత్యంత అభ్యంతరకరమైన పదాలను వాడారు. సావిత్రి, సౌందర్యలను స్ఫూర్తిగా తీసుకోవాలని, హీరోయిన్లు సంప్రదాయబద్ధంగా ఉండాలని హితవు పలికారు. అయితే, ఆయన వాడిన కొన్ని పదాలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయంటూ పరిశ్రమలో నిరసన వ్యక్తమైంది.

ముదురుతున్న వివాదం.. 

శివాజీ వ్యాఖ్యలపై  సింగర్ చిన్మయి నిప్పులు చెరిగారు. ఒక ప్రొఫెషనల్ వేదికపై మహిళలను ఉద్దేశించి ‘దరిద్రపు ము...’ వంటి బూతు పదాలను ఎలా వాడుతారని ఆమె ప్రశ్నించారు. కేవలం స్త్రీ ద్వేషులు (Incels) మాత్రమే వాడే ‘సామాన్లు’ అనే పదాన్ని వాడటంపై ఆమె మండిపడ్డారు. హీరోయిన్లకు సంప్రదాయం గురించి పాఠాలు చెప్పే శివాజీ గారు.. తాను మాత్రం జీన్స్, హూడీలు వేసుకుంటారు. సంప్రదాయంపై అంత ప్రేముంటే ఆయన కేవలం ధోతీలే కట్టుకోవాలి కదా? అని చిన్మయి నిలదీశారు.   

►ALSO READ | Manchu Manoj: మహిళల వస్త్రధారణపై నీతులు చెబితే ఊరుకోం.. శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలకు మనోజ్ కౌంటర్!

మరోవైపు శివాజీ వ్యాఖ్యలపై యాంకర్ అనసూయ కూడా రియాక్ట్ అయ్యారు.  నా శరీరం నా ఇష్టం... ఇది మీది కాదు.. అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అటు మంచు మనోజ్ స్పందిస్తూ.. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 14, 15, 21లను గుర్తు చేశారు. మహిళల దుస్తుల విషయంలో తీర్పు ఇచ్చే అధికారం ఎవరికీ లేదని, ఒక సీనియర్ నటుడు అలా మాట్లాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. తాజాగా వర్మ ఎంట్రీ ఇవ్వడంతో ఈ ఇష్యూ మరింత హాట్ టాపిక్‌గా మారింది. వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించని వారు ఇండస్ట్రీలో ఉండకూడదనే వాదనలు వినిపిస్తున్నాయి.

సెలబ్రిటీల బాధ్యత ఎక్కడ?

ప్రస్తుత కాలంలో హీరోయిన్ల వస్త్రధారణ అనేది వారి వ్యక్తిగత విషయం, వృత్తిలో భాగం. కానీ, బహిరంగ వేదికలపై వారి క్యారెక్టర్‌ను జడ్జ్ చేసేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మొత్తానికి శివాజీ చేసిన వ్యాఖ్యలు ఆయనకే చుట్టుకున్నాయి. ఒకప్పుడు హీరోగా, ఆపై రాజకీయ విశ్లేషకుడిగా పేరు తెచ్చుకున్న శివాజీ.. ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖుల ఆగ్రహానికి గురవుతున్నారు. వర్మ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలపై శివాజీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.