మోండల్కు అత్యంత సన్నిహితుడి ఇళ్లపై సీబీఐ సోదాలు

మోండల్కు అత్యంత సన్నిహితుడి ఇళ్లపై సీబీఐ సోదాలు

పశువుల కుంభకోణం కేసులో సీబీఐ దూకుడు పెంచింది. పశ్చిమబెంగాల్ లో ఈ స్కాంలో ప్రమేయం ఉన్న  తృణమూల్ నేతలు, వారికి అత్యంత సన్నిహితుల ఇళ్లపై మెరుపు దాడులు చేస్తోంది. టీఎంసీ  బీర్భూమ్ జిల్లా అధ్యక్షుడు అనుబ్రత మోండల్ కు అత్యంత సన్నిహితుడు, వ్యాపారవేత్త నివాసంలో  సోదాలు చేశారు. కోల్ కతా, బోల్ పూర్ లో నాలుగుచోట్ల తనిఖీలు నిర్వహించారు. 2020 పశువుల అక్రమ రవాణా కేసులో మోండల్ ను ఇటీవల సీబీఐ అరెస్ట్ చేసింది. అతడికి సీబీఐ న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మోండల్ కూడా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు. 

మోండల్ అరెస్ట్ తర్వాత బీజేపీ, తృణమూల్ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య  బీజేపీ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రతీకారంతోనే మోండల్ కు సీబీఐ సమన్లు జారీ చేసిందని మండిపడ్డారు. భారత్,బంగ్లాదేశ్ సరిహద్దు గుండా అక్రమంగా పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో బీఎస్ఎఫ్ మాజీ కమాండర్ ను 2020 సెప్టెంబర్ 21న సీబీఐ అరెస్ట్ చేసింది. కేసు దర్యాప్తు సమయంలో  మోండల్ పేరు తెరపైకి వచ్చింది.