సిజేరియన్​లు చేయలేం..  ప్రైవేట్ దవాఖాన్లకు పొండి 

సిజేరియన్​లు చేయలేం..  ప్రైవేట్ దవాఖాన్లకు పొండి 
  • రిమ్స్ లో మత్తుమందిచ్చే డాక్టర్ లేరంటూ ప్రైవేట్ కు రిఫర్  
  • డెలివరీలకు వచ్చిన పేషెంట్ల ఆందోళన 

ఆదిలాబాద్, వెలుగు:  మత్తుమందు ఇచ్చే డాక్టర్ల కొరతతో ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానలో సిజేరియన్ ఆపరేషన్ లు నిలిచిపోతున్నయి. ‘‘అనస్తీషియా డాక్టర్లు లేరు. సిజేరియన్ లు చేయలేం. ప్రైవేట్ కు వెళ్లి డెలివరీ చేయించుకోండి..” అంటూ డాక్టర్లు రిఫర్ చేస్తున్నారంటూ పేషెంట్లు, వాళ్ల బంధువులు చెప్తున్నారు. రిమ్స్ లో మొత్తం ఐదుగురు అనస్తీషియా డాక్టర్లు పని చేస్తుండగా, వారిలో ఇద్దరు లోకల్ లీడర్ల ఒత్తిళ్లు భరించలేక వెళ్లిపోయారు. మిగతా ముగ్గురిలో శుక్రవారం ఇద్దరు అనారోగ్యం కారణంగా సెలవు తీసుకున్నారు. ఒకరు ఆసుపత్రికి వచ్చి పరిస్థతి చూసి వెళ్లిపోయారు. దీంతో ఆరోజు జరగాల్సిన సిజేరియన్​లు, నార్మల్ డెలివరీలు పూర్తిగా నిలిచిపోయాయి. శుక్రవారం రిమ్స్​ ఆసుపత్రిలోని గైనిక్​ వార్డుకు ఏడు డెలివరీ కేసులు రాగా అందులో నలుగురికి నార్మల్​ డెలివరీ, ముగ్గురికి సిజేరియన్ చేయాల్సి ఉంది. కానీ సిబ్బంది లేకపోవడంతో డెలివరీలు చేయలేని పరిస్థితి నెలకొంది. దీనిపై రిమ్స్​ డైరెక్టర్ కరుణాకర్​ను ప్రశ్నించగా.. అనస్తీషియా డాక్టర్లు లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అనస్తీషియా డాక్టర్లు కావాలని ఇప్పటికే డీఎంఈకి లేఖలు రాసినా, స్పందించలేదన్నారు. రిమ్స్​లో డెలివరీలు నిలిచిపోవ డంతో శుక్రవారం ఓ మహిళకు కడుపులోనే  పిండం చనిపోయిందని ఆమె బంధువులు ఆరోపించారు. డెలివరీల కోసం హాస్పిటల్​కు వచ్చిన గర్భిణీల్లో కొందరు ప్రైవేట్​కు వెళ్లగా, మిగతావారు ఆందోళన 
చెందుతున్నారు.