సిగరెట్​ దొంగలు దొరికిన్రు.. ఆర్థిక ఇబ్బందులతో చోరీకి స్కెచ్​

సిగరెట్​ దొంగలు దొరికిన్రు.. ఆర్థిక ఇబ్బందులతో చోరీకి స్కెచ్​

    ముగ్గురు మహారాష్ట్రవాసుల అరెస్ట్

    2న చందానగర్​లో రూ.80 లక్షల విలువైన సిగరెట్ల దొంగతనం

చందానగర్​(హైదరాబాద్​), వెలుగు: సిగరెట్​ కార్టన్ల దొంగలు దొరికారు. హైదరాబాద్​లోని చందానగర్​లో ఉన్న శ్రీవిష్ణు ప్రాంచైజ్​ ప్రైవేట్​ లిమిటెడ్​ కంపెనీ గోడౌన్​లో రూ.80 లక్షల విలువైన సిగరెట్​ కార్టన్లు కొద్ది రోజుల క్రితం చోరీకి గురైన సంగతి తెలిసిందే. ఆ కేసులో ముగ్గురిని చందానగర్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. వివరాలను శనివారం డీసీపీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. మహరాష్ర్ట నాందేడ్​ జిల్లా వఘాల గ్రామానికి చెందిన సంజయ్​ పుండలిక్​ (38), అదే జిల్లా దత్తమందిర్​కు చెందిన నాందేవ్​ సాంబాజీ ముండే (53), న్యూఎన్​ఐఆర్​ ప్రాంతానికి చెందిన రాథోడ్​ రాజేబు బాబు (41)లను అదుపులోకి తీసుకున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో చోరీకి స్కెచ్​

సంజయ్​ బట్టల షాపును నడుపుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడడంతో తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించేందుకు దొంగతనం స్కెచ్​ వేశాడు. ఇందుకు డ్రైవర్​గా పనిచేసే నాందేవ్​, టీస్టాల్​ నడుపుకునే రాథోడ్​, కాశీనాథ్​, రాజు ఎన్వాడే, దిగంబర్​ దుమలేలతో కలిసి గ్రూప్​గా ఏర్పడ్డాడు. పోయినేడాది డిసెంబర్​ 25న దిగంబర్​ మినహా మిగతా వాళ్లతో సంజయ్​ చోరీకి స్కెచ్​ వేశాడు. అందరూ కలిసి హైదరాబాద్​లోని సిగరెట్​ కంపెనీలో చోరీ చేయాలని డిసైడ్​ అయ్యారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్​కు వచ్చి రెక్కీ చేశారు. చందానగర్​లోని కృష్ణవేణి టాలెంట్​ స్కూల్​ బిల్డింగ్​ వద్ద డీసీఎం నుంచి సిగరెట్​ కార్టన్లను దింపి నాలుగో అంతస్తులోకి తీసుకుపోతుండడాన్ని గుర్తించారు. జనవరి 2న శ్రీవిష్ణు ప్రాంచైజ్​ ప్రైవేట్​ లిమిటెడ్​ కంపెనీలో అర్ధరాత్రి, గోడౌన్​ గ్రిల్స్​ తీసేసి, సీసీటీవీ కెమెరాల కనెక్షన్​ను కట్​ చేశారు. గోడౌన్​లోని 59 సిగరెట్​ కార్టన్లను చోరీ చేసి మినీ ట్రక్కులో పరారయ్యారు. ప్రాంచైజీ యజమాని ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. సిగరెట్​ కార్టన్లతో పాటు మినీ ట్రక్కు, కారు, రెండు సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో నాందేవ్​ పాత నేరస్థుడని పోలీసులు చెబుతున్నారు. కాశీనాథ్​, రాజు, దిగంబర్​ పరారీలో ఉన్నారు.