
హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రధాన రహదారుల్లో వాహనాల రద్దీ తీవ్రంగా పెరిగింది. హైదరాబాద్ లో ఉంటూ ఓటు వేసేందుకు సొంత గ్రామాలకు వెళ్లిన పబ్లిక్ అంతా ఒక్కసారిగా రిటర్న్ అయ్యారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాట సింగారం NH 65 పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి అవస్థలు పడుతున్నారు. వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో బాట సింగారం గ్రామంలో నుంచి వాహనాలను దారి మళ్లించారు పోలీసులు.
మరోవైపు చౌటుప్పల్ లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద సైతం ఫుల్ ట్రాఫిక్ ఏర్పడింది.
తెలంగాణ వ్యాప్తంగా 65 శాతం లోక్ సభ ఎన్నికల ఓటింగ్ పోలైంది. ఏపీలో 80 శాతానికి పైగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నమోదైంది. ఈసీ విడుదల చేసిన గుణాంకాల ప్రకారం హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్న వాళ్లు సొంత ఊరు వెళ్లి ఓటు వేసేందుకు మొగ్గు చూపినట్టు స్పష్టమౌతుంది.