Tanuja PuttuSwamy: బిగ్‌బాస్ 9 ట్రోఫీ మిస్సైనా భారీగా వెనకేసిన తనూజ.. రన్నర్ గా ఎంత సంపాదించిందో తెలుసా?

Tanuja PuttuSwamy: బిగ్‌బాస్ 9 ట్రోఫీ మిస్సైనా భారీగా వెనకేసిన తనూజ.. రన్నర్ గా ఎంత సంపాదించిందో తెలుసా?

తెలుగు బుల్లితెరపై గత 105 రోజులుగా సాగిన వినోదాల విందు 'బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9' ఆదివారంతో గ్రాండ్‌గా ముగిసింది. సామాన్యుడిగా, ఆర్మీ జవాన్‌గా హౌస్ లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడగా, సీరియల్ నటి తనూజ పుట్టస్వామి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే, ఈ సీజన్.. విజేత కళ్యాణ్ అయితే, షోను తన భుజాలపై మోసింది మాత్రం తనూజ అనడంలో అతిశయోక్తి లేదు.

అరుపుల నుండి ఆరాధన వరకు..

తనూజ హౌస్‌లోకి అడుగుపెట్టిన కొత్తలో ఆమె ప్రవర్తనపై విమర్శలు వచ్చాయి. అతిగా అరవడం, చిన్న విషయాలకే ఏడవడం చూసి ఈమె హౌస్‌లో ఎన్నాళ్లు ఉంటుంది అని అందరూ పెదవి విరిచారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ.. ఆ అరుపులు, ఏడ్పులు వెనుక ఉన్నది నటన కాదు, స్వచ్ఛమైన ఎమోషన్ అని ప్రేక్షకులు గుర్తించారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం, ఎవరికీ భయపడకుండా తన వాదన వినిపించడం ఆమెను మిగతా వారి కంటే భిన్నంగా నిలబెట్టాయి.

ఆల్ రౌండర్ ప్రదర్శన

తనూజ ఈ సీజన్‌లో వన్ ఉమెన్ షో చేసింది. అందరికీ రుచికరమైన భోజనం వండి పెడుతూ ఇంటి సభ్యుల ఆకలి తీర్చింది. టాస్కుల్లో సింహంలా దూసుకుపోయింది. శారీరక బలం అవసరమైన టాస్కుల్లో మగాళ్లతో సమానంగా పోటీ పడింది. ముఖ్యంగా మైండ్ గేమ్‌లో ఇమ్మాన్యుయేల్‌కు గట్టి పోటీ ఇచ్చింది. గ్లామర్ షోకు తావు లేకుండా, ఎంతో పద్ధతిగా ఉంటూ ఫ్యామిలీ ఆడియన్స్‌కు చేరువైంది.

మిత్రుల కోసం.. శత్రువుల పైన..

తనూజలో ఉన్న గొప్ప లక్షణం తన వారి కోసం నిలబడటం. కళ్యాణ్ క్యారెక్టర్‌ను కొందరు వక్రీకరించినప్పుడు ఆమె అండగా నిలిచింది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మాధురి, ఆయేషా తనను తొక్కేయాలని చూసినా, చివరకు తన మంచితనంతో వారినే మిత్రులుగా మార్చుకుంది. భరణి, దివ్యలతో ఏర్పడిన గొడవలు ఆమెను మానసికంగా కృంగదీసినా, తిరిగి ఫీనిక్స్‌లా లేచి నిలబడింది.

ఓటమికి కారణాలు ఏంటి?

ఒక దశలో ఓటింగ్‌లో కళ్యాణ్ కంటే తనూజనే ముందంజలో ఉంది. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో తొలి మహిళా విజేతగా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ సోషల్ మీడియాలో ఆమెపై జరిగిన దుష్ప్రచారం ఓటింగ్‌పై ప్రభావం చూపిందంటున్నారు అభిమానులు.  ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్, కామనర్ సెంటిమెంట్ కళ్యాణ్‌కు భారీగా ప్లస్ అయ్యాయి. తనూజ అభిమానులు కూడా కొందరు కళ్యాణ్ వైపు మొగ్గు చూపడం ఆమెకు నష్టాన్ని చేకూర్చింది.

సంపాదన ఎంత?

టైటిల్ మిస్ అయినా, తనూజ భారీగానే వెనకేసినట్లు సమాచారం. వారానికి రూ. 2.50 లక్షల రెమ్యునరేషన్ చొప్పున, 15 వారాలకు గానూ దాదాపు రూ. 37,50,000 ఆమె అందుకున్నట్లు తెలుస్తోంది. ఇది విన్నర్ ప్రైజ్ మనీకి దాదాపు సమానం కావడం విశేషం. పోరాడి ఓడినా తనూజ సగర్వంగా బయటకు వచ్చింది. టైటిల్ రాకపోయినా, బిగ్‌బాస్ ద్వారా ఆమె సంపాదించుకున్న గుర్తింపు, క్రేజ్ ఆమె కెరీర్‌ను మరో మెట్టు ఎక్కించబోతున్నాయి.