చలికాలంలో చలి నుంచి మన చర్మాన్ని కాపాడుకోవడానికి లోషన్లు పూస్తాం, శరీరాన్ని వెచ్చగా ఉంచుకుంటాం. కానీ మన కళ్ళను మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటాం. అందుకే చలికాలంలో కళ్ళు పొడిబారడం (Dry Eye Syndrome) గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే....
డ్రై ఐ సిండ్రోమ్ అంటే ఏమిటి?
మన కంటి ఉపరితలంపై తేమను నిలిపి ఉంచడానికి కన్నీటి పొర చాలా అవసరం. ఇందులో నీరు, నూనె, జిగురు లాంటి పదార్థాలు ఉంటాయి. కళ్ళు తగినన్ని కన్నీళ్లను ఉత్పత్తి చేయలేకపోయినా లేదా ఉన్న తేమ వేగంగా ఆవిరైపోయినా 'డ్రై ఐ సిండ్రోమ్' వస్తుంది.
చలికాలంలోనే ఎందుకు :
చలికాలంలో బయట ఉండే చల్లని గాలి కళ్లలో తేమను త్వరగా ఆవిరి చేస్తుంది. ఇళ్లలో వాడే హీటర్ల వల్ల గాలిలో తేమ తగ్గిపోయి కళ్లు పొడిబారుతాయి. చలికి బయటకు వెళ్లకుండా ఫోన్లు, కంప్యూటర్లు ఎక్కువగా చూడటం వల్ల మనం కనురెప్పలు వేయడం తగ్గిస్తాం. దీనివల్ల కళ్లకు లూబ్రికేషన్ అందదు.
ALSO READ : ఆలివ్ ఆయిల్ తో చలికాలంలో మీ చర్మం నిగనిగలాడుతోంది..!
డ్రై ఐ సిండ్రోమ్ లక్షణాలు ?
కళ్లలో మంట లేదా దురద, చికాకు అనిపించడం, కళ్లు ఎర్రబడటం, కాంతిని చూడలేకపోవడం, కంటిలో ఏదో దుమ్ము, ఇసుక పడినట్లు అనిపించడం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
గదిలో తేమను పెంచడానికి హ్యూమిడిఫైయర్ వాడండి. ఇంకా బయటకు వెళ్లేటప్పుడు చలిగాలి తగలకుండా సన్ గ్లాసెస్ పెట్టుకోండి. దాహం వేయకపోయినా రోజంతా తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలు, వాల్‌నట్స్, అవిసె గింజలు తీసుకోండి. కంప్యూటర్ వాడేటప్పుడు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడండి. కంప్యూటర్, ఫోన్ వాడటం వల్ల బ్లింక్ రేటు నిమిషానికి 15–20 బ్లింక్‌ల నుండి 7–10కి తగ్గుతుంది, అంటే మీ కళ్ళు కన్నీళ్ల నుండి తగినంత లూబ్రికేషన్ పొందవు. వైద్యుల సలహాతో కంటిని తేమగా ఉంచే డ్రాప్స్ వాడండి. కళ్లను అస్సలు రుద్దకండి. ఒకవేళ ఈ లక్షణాలు లేదా సమస్య తీవ్రంగా ఉంటే ఆలస్యం చేయకుండా కంటి వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం లేదంటే ఇన్ఫెక్షన్లు రావచ్చు.
