విద్య, నైపుణ్యం రెండూ ముఖ్యమే..స్టూడెంట్లతో ప్రధాని ముఖాముఖి

విద్య, నైపుణ్యం రెండూ ముఖ్యమే..స్టూడెంట్లతో ప్రధాని ముఖాముఖి
  • కానీ జీవితంలో నైపుణ్యాలు అత్యవసరం: ప్రధాని మోదీ
  •     చదువులను భారంగా చూడొద్దు
  •     పరీక్షలను పండుగలా చూడాలి.. 
  •     మారుతున్న కాలానికి తగ్గట్టుగా టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
  •     ‘పరీక్షా పే చర్చ’లో 9వ ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా స్టూడెంట్లు, టీచర్లతో ప్రధాని ముఖాముఖి

న్యూఢిల్లీ: విద్యార్థులకు చదువుతో పాటు స్కిల్స్‌‌ కూడా  అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ‘‘చదువు, నైపుణ్యం రెండూ ముఖ్యమే. కానీ, జీవితంలో నైపుణ్యాలు అత్యంత కీలకం” అని వెల్లడించారు. పరీక్షా పే చర్చ 9వ ఎడిషన్‌‌లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో  ప్రధాని మోదీ ముఖాముఖిగా మాట్లాడారు. ఎడ్యుకేషన్, ఏఐ, స్కిల్స్, దేశాభివృద్ధిపై ఆయన కీలక సూచనలు చేశారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను శుక్రవారం  ‘ఎక్స్’ వేదికగా మోదీ షేర్ చేశారు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా సాంకేతికతను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. సాంకేతికత ఒక వరం అని, దాన్ని మనం స్వీకరించాలి అని పేర్కొన్నారు. మీ మేధస్సును, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి ఏఐని తెలివిగా ఉపయోగించుకోండి అని సూచించారు.
పరీక్షల ఒత్తిడి వద్దు.. - సంపూర్ణ వికాసం ముఖ్యం
చదువును భారంగా భావించకూడదని, చదువులో పూర్తిగా నిమగ్నమైనప్పుడే అన్ని విషయాలు గుర్తుంటాయని విద్యార్థులకు మోదీ సూచించారు. కేవలం మార్కులపైనే దృష్టి పెట్టకుండా, జీవితంలో ఎక్కడికి చేరుకోవాలనుకునేదానిపై ఫోకస్ చేయడం ముఖ్యమని తెలిపారు. ‘‘జీవితం అంటే కేవలం పరీక్షలు మాత్రమే కాదు. విద్య అనేది కేవలం మన వికాసానికి ఒక మార్గం మాత్రమే. పరీక్షలే తుది లక్ష్యం కాకూడదు. సంపూర్ణ అభివృద్ధి సాధించడమే మన లక్ష్యం కావాలి” అని తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెప్పే సూచనలు వింటూనే,  సొంత శైలిపై నమ్మకం కలిగి ఉండాలని సూచించారు.  లక్ష్యం చేరువలో ఉండాలి కానీ.. అది సులభంగా దొరికేదిగా ఉండకూడదని, కష్టపడి సాధించేదిగా ఉండాలన్నారు. ‘‘ మొదట మీ మనస్సును 
గెలవండి, ఆపై మనస్సును ఏకం చేయండి, ఆ తర్వాతే చదువుపై దృష్టి పెట్టండి” అని సూచించారు.

బ్యాలెన్స్​ మెయింటెయిన్ చేయాలి

తాను ప్రధానిని అయినా..  పనితీరు గురించి ప్రజలు ఎన్నో విషయాలు చెప్తుంటారని,  అందులో కొన్ని సూచనలు తీసుకొని తన పనిలో మార్పులు చేసుకున్నానని మోదీ చెప్పారు. ఎడ్యుకేషన్, రెస్ట్‌‌, హ్యాబిట్‌‌, స్కిల్స్‌‌ను మెరుగుపర్చుకోవడంలో ఒక బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలని, అదే ఎదుగుదల కు కీలకంగా మారుతుందని చెప్పారు. క్రీడలు శారీరక, మానసికోల్లాసానికి తోడ్పడుతాయని, వాటిని ఒక సరదాగా మాత్రమే చూడొద్దన్నారు. తక్కువ ధరకే ఇంటర్నెట్‌‌ లభిస్తుందని సమయం వృథా చేసుకోవద్దని చెప్పారు. పాఠాల షెడ్యూల్‌‌ను ముందుగానే విద్యార్థులకు చెబితే, వారిలో కుతూహలం పెరుగుతుందని టీచర్లకు సూచించారు. ‘‘2047 నాటికి మీకు 35–-40 ఏండ్లు ఉంటాయి. అప్పుడు దేశం ఏ స్థితిలో ఉండాలో ఇప్పుడే ఆలోచించాలి. వికసిత్ భారత్ నిర్మాణం కోసం నేను కష్టపడుతుంటే.. మీరు కూడా అందులో భాగస్వాములు కావాలి కదా?” అని విద్యార్థులను ఉత్సాహపరిచారు.