- 24/7 గంటలూ పనులు చేయాలని ఇటీవల ఆదేశాలు
- టన్నెల్ నిపుణుడిని ఫారిన్ ట్రిప్‌కు తీసుకెళ్తున్న నిర్మాణ సంస్థ
- టీబీఎం లేకున్నా విడిభాగాల కోసం అంటూ10 రోజుల యూరప్ పర్యటన
- ప్రభుత్వమూ అనుమతి ఇచ్చిందన్న చర్చ
హైదరాబాద్, వెలుగు: ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పరిస్థితి త్రిశంకు స్వర్గాన్ని తలపిస్తున్నది. కొన్నేండ్లుగా ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. ఈ ఏడాదైనా పనులు పూర్తవుతాయా? లేదా? అన్న ఆందోళన అధికారులను వెంటాడుతున్నది. ఈ ఏడాది జూన్‌లోపు పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిరుడు డిసెంబర్‌నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని అనుకున్నది. అయితే, అనుకోని ప్రమాదంతో దాదాపు 4 నెలలపాటు పనులు ఆగిపోయాయి.
ఇన్‌లెట్ వద్ద పైకప్పు కూలిన ఘటనలో 8 మంది సిబ్బంది చనిపోయారు. ఆ ప్రాంతం నుంచి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్) భాగాలను ఇటీవలే బయటకు తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే పనులను పున:ప్రారంభించేందుకు సర్కారు నిర్ణయించింది. ఎస్‌ఎల్‌బీసీ కోసమే ప్రత్యేకంగా ఓ డివిజన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు స్పెషల్‌గా ఓ సీఈని నియమించింది.
అయితే, నిర్మాణ సంస్థ, ప్రభుత్వం ఏరికోరి తెచ్చుకున్న టన్నెల్ ఎక్స్‌పర్ట్ పరీక్షిత్ మెహ్రా తీరు ఇప్పుడు డిపార్ట్మెంట్కు తలనొప్పిగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ టన్నెల్ పనులను వేగంగా చేయాల్సిందిపోయి.. ఇప్పుడు పరీక్షిత్మెహ్రాను నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్ విదేశీ పర్యటనలకు తీసుకెళ్తున్నదన్న చర్చ జరుగుతున్నది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా.. ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చిందని తెలుస్తున్నది.
టీబీఎం వాడే అవసరం లేకున్నా..
టన్నెల్పైకప్పు కూలిపోవడంతో.. టన్నెల్‌బోరింగ్ మెషీన్‌తో పనులు ఇక చేయలేమని ఎక్స్‌పర్ట్స్ ఇప్పటికే తేల్చారు. ఈ క్రమంలోనే డ్రిల్లింగ్అండ్బ్లాస్టింగ్ (డీబీఎం)తోనే పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ముందుకు వెళ్తున్నారు. ఇటీవల దీనిపై రివ్యూ చేసిన మంత్రి ఉత్తమ్.. 24/7 పనులు చేయాలని ఆదేశాలిచ్చారు.
అయితే, ఇప్పుడు టీబీఎం అవసరం లేకపోయినా.. టీబీఎం విడిభాగాలను పరిశీలించే పేరిట పరీక్షిత్ మెహ్రాను నిర్మాణ సంస్థ 10 రోజుల యూరప్ ట్రిప్‌కు తీసుకెళ్తున్నట్టు సమాచారం. టన్నెల్ పనులకు సంబంధించి ప్రతి ఫైలూ తన దృష్టిలోకి రావాలని పరీక్షిత్ మెహ్రా చెప్పడంతో ఆయనతో నిర్మాణ సంస్థ సన్నిహితంగా మెలుగుతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ ఫండ్స్ కోసం పట్టుబట్టి పనులు చేయకుండా ఆపిన నిర్మాణ సంస్థ.. కాంగ్రెస్ సర్కార్ రూ.460 కోట్లు ఇచ్చినా.. ఇంకా నిధుల కోసమే పట్టుపడుతున్నది. మరో రూ.132 కోట్లు ఎస్క్రో అకౌంట్‌లో వేసేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది.
ఇలాంటి టైంలో పనులు వేగంగా చేయాల్సిన సంస్థ.. డెడ్‌లైన్‌లోపు పూర్తి చేయాల్సి ఉన్నా.. టీబీఎం సాకుతో విదేశీ పర్యటనలకు వెళ్లాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ మెథడ్‌లోనే పనులు చేపడుతున్నా.. ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీలంటూ సాకులు చెబుతూ కావాలనే పనులను లేట్ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బుల కోసమే సంస్థ ఇలాంటి ఎత్తులు వేస్తున్నదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన టన్నెల్ ఎక్స్‌పర్ట్ కూడా ఏజెన్సీ చెప్పినట్టు ఆడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాగే, ఎప్పటికప్పుడు పనులను లేట్ చేస్తుంటే ఈ ఏడాదైనా పనులు పూర్తి కాబోవన్న చర్చ ఇరిగేషన్ వర్గాల్లో జరుగుతున్నది.
ఇంకో 32 శాతం పనులు చేయాలె..
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను మొత్తం 43.954 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. అందులో ఔట్లెట్వైపు నుంచి 20.435 కిలోమీటర్లు, ఇన్లెట్నుంచి 13.954 కిలోమీటర్ల పనులు జరిగాయి. మరో 9.54 కిలోమీటర్ల పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. టన్నెల్ పైకప్పు కూలిపోవడంతో.. షియర్ జోన్లు ఇంకెన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రభుత్వం నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌తో హెలిబార్న్ సర్వే చేయించింది.
ఆ సర్వేకు తగ్గట్టుగా డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పద్ధతిలో టన్నెల్‌ను తవ్వాలని నిర్ణయించారు. రాక్ బోల్ట్ హోల్ డ్రిల్లింగ్, ఆర్సీసీ (కాంక్రీట్) కాస్టింగ్పనులు జరుగుతున్నాయి. ప్రమాదంతో టన్నెల్‌లో ఉన్న నీళ్లను తోడివేసే పనులూ ముమ్మరంగా సాగుతున్నాయి. నిమిషానికి 4,381 లీటర్ల నీటిని తోడుతుండగా.. టీబీఎం కూలిన చోట నిమిషానికి మరో 1,486 లీటర్ల నీటిని తోడుతున్నారు. రైలు లైన్ పనులను ముమ్మరంగా చేస్తున్నారు. 74 మంది కార్మికులతో ఆ పనులను చేయిస్తున్నారు.
టన్నెల్ ఔట్‌లెట్ వద్ద టీబీఎంను ఇప్పటికే తొలగించేశారు. అక్కడ అధునాతన టెక్నాలజీతో పనులు చేయించాలని భావిస్తున్నారు. డ్రిల్లింగ్ కోసం బూమర్యంత్రాలు, కాంక్రీట్ లైనింగ్ కాస్టింగ్ కోసం సీఫా షాట్‌క్రీట్, వెట్షాట్క్రీట్, సెల్ఫ్‌లోడింగ్ మిక్సర్, ఎయిర్ కూల్డ్ లోకో ఇంజన్, ప్లాట్‌ఫాం యాక్సిల్, ఎలక్ట్రిక్ కంప్రెసర్‌లాంటి యంత్రాలను తీసుకురావాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే, జూన్‌లోపు డెడ్‌లైన్ పెట్టుకున్నా.. అప్పటివరకు టన్నెల్ పనులు పూర్తవుతాయా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
