హైదరాబాద్ న‌గ‌రంలో రూ.500 కోట్ల విలువైన భూములను కాపాడిన హైడ్రా

హైదరాబాద్ న‌గ‌రంలో రూ.500 కోట్ల విలువైన భూములను కాపాడిన హైడ్రా
  •     దూలపల్లి, యూసుఫ్​గూడ, మేడ్చల్​లో భూముల స్వాధీనం

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్​న‌గ‌రంలో మూడు చోట్ల ఆక్రమ‌ణ‌ల‌కు గురైన రూ.500 కోట్ల విలువైన భూములను హైడ్రా కాపాడింది. మేడ్చల్- మ‌ల్కాజిగిరి జిల్లా దూల‌ప‌ల్లి విలేజ్‌లోని సుమారుకుంట‌లో అక్రమ క‌ట్టడాల‌ను తొల‌గించింది. 42 ఎక‌రాల ప‌రిధిలో ఈ చెరువు విస్తరించి ఉంది. శిఖం ప‌ట్టా ఉందంటూ ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో మ‌ట్టి నింప‌డం, ప‌లు నిర్మాణాలు చేప‌ట్టడంతో హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. 

ఇలా11 ఎక‌రాల మేర ఆక్రమ‌ణ‌లు గుర్తించిన హైడ్రా  వాటిని తొల‌గించింది. యూసుఫ్​గూడలో స‌ర్వే నంబ‌ర్​128/1 లోని మూడున్నర ఎక‌రాల ప్రభుత్వ భూమిని కూడా హైడ్రా కాపాడింది. 3.20 ఎక‌రాల భూమిలో ఇసుక వ్యాపారాలు, ఇటుక వ్యాపారాలతో పాటు వెల‌సిన తాత్కాలిక షెడ్లను తొల‌గించింది.   

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా  నాగారం రామకృష్ణ నగర్ కాలనీ (హెచ్ఎంటీ లేఔట్) లోని శివాల‌యానికి చెందిన 1,365 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. 2017లో 400 గజాల్లో శివాల‌యం నిర్మించగా మిగిలిన భూమి ఖాళీగా ఉంది. కొంత‌మంది స్థానికులు క‌బ్జా చేసేందుకు ప్రయ‌త్నిస్తున్నార‌ని రామ‌కృష్ణాన‌గ‌ర్ కాల‌నీ నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. 1,365 గ‌జాల స్థలం గుడికికి చెందిన‌దిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు పెట్టింది.