ఇన్‌స్టా‌మార్ట్‌లో రూ.22 లక్షలు ఖర్చు చేసిన కస్టమర్.. ఏమేం కొన్నాడంటే..

ఇన్‌స్టా‌మార్ట్‌లో రూ.22 లక్షలు ఖర్చు చేసిన కస్టమర్.. ఏమేం కొన్నాడంటే..

ఇప్పుడు 'ఇన్‌స్టామార్ట్' లో షాపింగ్ చేయడమే ట్రెండ్ అని నిరూపించాడు ఒక నెటిజన్. నిత్యావసర వస్తువుల డెలివరీకి ఫేమస్ అయిన క్విక్ కామర్స్ సంస్థ ఇన్‌స్టామార్ట్.. తన 'హౌ ఇండియా ఇన్‌స్టామార్టెడ్ 2025' వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్ట్‌లో ఒక యూజర్ చేసిన ఖర్చు చూసి దేశమంతా నోరెళ్లబెడుతోంది. అవునండి బాబు ఏకంగా వేలల్లో కాకుండా ఏడాదిలోనే లక్షల్లో షాపింగ్ చేసి కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు.

రూ.22 లక్షల షాపింగ్.. కోడిగుడ్ల నుంచి ఐఫోన్ల వరకు..
ఈ ఏడాది అత్యధికంగా ఖర్చు చేసిన క్విక్ కామర్స్ యూజర్ ఏకంగా రూ.22 లక్షల విలువైన ఆర్డర్లు ఇచ్చాడు. అతని షాపింగ్ లిస్ట్‌లో నిత్యం వాడే పాలు, పండ్లు, కోడిగుడ్లతో పాటు ఏకంగా 22 ఐఫోన్ 17లు, 24 క్యారెట్ల బంగారు నాణేలు షాపింగ్ చేశాడు. 10 నిమిషాల డెలివరీ వ్యవస్థ కేవలం పప్పులు, ఉప్పులకే పరిమితం కాకుండా.. లగ్జరీ వస్తువులకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఇది నిరూపిస్తోంది.

బెంగళూరు యూజర్స్ సూపర్..
డెలివరీ భాగస్వాముల పట్ల సానుభూతి చూపడంలో బెంగళూరు వాసులు ముందుంటారని మరోసారి స్పష్టమైంది. బెంగళూరుకు చెందిన ఒక వినియోగదారుడు ఈ ఏడాది డెలివరీ బాయ్స్‌కు ఏకంగా రూ.68వేల600 టిప్‌గా ఇచ్చాడు. దేశవ్యాప్తంగా ఇదే అత్యధిక టిప్ అని ఇన్‌స్టామార్ట్ వెల్లడించింది. బెంగళూరులో కేవలం రూ.10 విలువైన ప్రింటవుట్ నుంచి హైదరాబాద్‌లో రూ.4లక్షల 3వేలు విలువైన ఐఫోన్ల సింగిల్ కార్ట్ వరకు.. భారతీయులు క్విక్ కామర్స్‌ను ఎలా వాడుతున్నారో ఈ రిపోర్ట్ కళ్లకు కట్టింది.

ALSO READ : ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ రూల్స్ మార్పు..

ఒకప్పుడు అత్యవసరంగా ఏదైనా వస్తువు కావాలంటేనే ఇన్‌స్టామార్ట్ వాడేవారు. కానీ ఇప్పుడు పండగ గిఫ్టులు, గ్యాడ్జెట్లు, పర్సనల్ కేర్ వస్తువులకు కూడా దీనినే నమ్ముకుంటున్నారు ప్రజలు.
1. హైదరాబాద్ యూజర్ ఒకేసారి రూ.4.3 లక్షల విలువైన ఐఫోన్లను ఆర్డర్ చేయటం సరికొత్త రికార్డు సృష్టించింది.
2. బెంగళూరులో యూజర్లు కొరియన్ సాస్‌లు, లేట్ నైట్ స్నాక్స్‌ను అత్యధికంగా ఆర్డర్ చేశారు.
3. హైదరాబాద్‌లో ఒక వినియోగదారుడు ఒకేసారి రూ.31వేల 240 విలువైన గులాబీలను ఆర్డర్ చేయడం విశేషం.

ఈ క్విక్ కామర్స్ పర్చేజ్ ట్రెండ్ చూస్తుంటే.. రాబోయే రోజుల్లో సంప్రదాయ ఈ-కామర్స్ సైట్ల కంటే 10 నిమిషాల్లో వచ్చే క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకే ఆదరణ మరింత పెరగనుందని స్పష్టమవుతోంది. ఏదేమైనా భారతీయులు లేటుకు అస్సలు ఛాన్స్ ఇవ్వటం లేదని ఇది నిరూపిస్తోంది.