ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ రూల్స్ మార్పు.. జనవరి నుంచి కొత్త ఛార్జీల మోత.. వివరాలివే

ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ రూల్స్ మార్పు.. జనవరి నుంచి కొత్త ఛార్జీల మోత.. వివరాలివే

ఐసీఐసీఐ బ్యాంక్ తమ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాకిస్తూ కీలక మార్పులను ప్రకటించింది. ఈ కొత్త రూల్స్ అండ్ ఛార్జీలు 2026 జనవరి ఫిబ్రవరి మధ్య కాలంలో విడతల వారీగా అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ గేమింగ్, వ్యాలెట్ లోడింగ్ ఇతర లావాదేవీలపై బ్యాంక్ కొత్తగా ఫీజులను ప్రవేశపెట్టింది. నిరంతరం మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రివార్డ్ పాయింట్ల నిర్మాణాన్ని కూడా బ్యాంక్ మార్చుతోంది. 

కొత్త మార్పుల ప్రకారం.. డ్రీమ్ 11, ఎంపీఎల్ వంటి ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో చేసే కార్డ్ యూజర్లు చేసే లావాదేవీలకు 2% అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. అలాగే అమెజాన్ పే, పేటీఎం వంటి వ్యాలెట్లలో రూ.5వేల కంటే ఎక్కువ నగదును లోడ్ చేస్తే 1% ఛార్జీ పడుతుంది. ట్రావెలింగ్ కోసం చేసే ఖర్చులు రూ.50వేలు దాటితే వాటిపై కూడా 1% సర్‌ఛార్జ్ వర్తిస్తుంది. ఇకపై యూజర్లు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి నేరుగా క్యాష్ రూపంలో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లిస్తే రూ.150 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

ALSO READ | టెక్కీలకు వీసా రెన్యూవల్ గండం: యూఎస్ జాబ్స్ పోతాయా? భారత్‌లో చిక్కుకున్న H-1B హోల్డర్ల ఆందోళన

'ఎమెరాల్డ్ మెటల్' వంటి ప్రీమియం కార్డ్ యూజర్లపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. వీరికి ప్రభుత్వ సేవలు, ఫ్యూయెల్, రెంట్, పన్ను చెల్లింపులు, వ్యాలెట్ లావాదేవీలపై రివార్డ్ పాయింట్లు పూర్తిగా నిలిపివేయబడ్డాయి. అదనంగా కొత్త యాడ్-ఆన్ కార్డ్ కావాలంటే రూ.3వేల500 వన్-టైమ్ ఫీజు చెల్లించాలి. ఎమెరాల్డ్, సాఫిరో వంటి కార్డులకు ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులపై నెలకు రూ.20వేల వరకు మాత్రమే రివార్డ్ పాయింట్లు వస్తాయి. మిడ్-టైర్ కార్డులకు ఈ పరిమితి రూ.10వేలకే లిమిట్ చేయబడింది.

ఎంటర్‌టైన్మెంట్ రంగంపై కూడా కోతలు విధించారు. బుక్‌మైషోలో మూవీ టికెట్స్ 'ఒకటి కొంటే ఒకటి ఉచితం' ఆఫర్ పొందాలంటే.. కార్డ్ యూజర్లు గత క్యాలెండర్ త్రైమాసికంలో కనీసం రూ.25వేలు ఖర్చు చేసి ఉండాలి. ఫిబ్రవరి నుండి ఇన్‌స్టంట్ ప్లాటినం కార్డ్ హోల్డర్లకు ఈ ప్రయోజనాన్ని పూర్తిగా తొలగిస్తోంది ఐసీఐసీఐ. విదేశీ కరెన్సీ లావాదేవీలపై కూడా మార్కప్ రేట్లు సవరించబడ్డాయి. ఈ మార్పులన్నీ 2026 జనవరి నుంచి అమల్లోకి వస్తాయి. కాబట్టి కార్డ్ హోల్డర్లు తమ ఖర్చుల ప్రణాళికను మార్చుకోవాలని బ్యాంక్ సూచించింది.