టెక్కీలకు వీసా రెన్యూవల్ గండం: యూఎస్ జాబ్స్ పోతాయా? భారత్‌లో చిక్కుకున్న H-1B హోల్డర్ల ఆందోళన

టెక్కీలకు వీసా రెన్యూవల్ గండం: యూఎస్ జాబ్స్ పోతాయా? భారత్‌లో చిక్కుకున్న H-1B హోల్డర్ల ఆందోళన

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులకు ఊహించని షాక్ తగిలింది. హెచ్-1బి వీసా రెన్యూవల్ కోసం స్వదేశానికి వచ్చిన వందలాది మంది భారతీయ టెక్కీలు ప్రస్తుతం భారత్‌లోనే చిక్కుకుపోయారు. అమెరికా కాన్సులేట్ కార్యాలయాలు అపాయింట్‌మెంట్లను అకస్మాత్తుగా రద్దు చేయడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇమ్మిగ్రేషన్ లాయర్లు దీనిని చాలా పెద్ద గందరగోళంగా చెబుతున్నారు. ట్రంప్ ఇటీవలి కఠిన చర్యలే దీనికి ప్రధాన కారణంగా వారు పేర్కొంటున్నారు. 

డిసెంబర్ 15 నుంచి 26 మధ్య కాలంలో వీసా రెన్యూవల్ అపాయింట్‌మెంట్లు ఉన్న వందలాది మంది భారతీయులకు అమెరికా కాన్సులేట్ నుంచి షాకింగ్ మెసేజ్‌లు వచ్చాయి. క్రిస్మస్, నూతన సంవత్సర సెలవుల సమయంలో ఈ స్లాట్స్ రద్దు కావడంతో.. తిరిగి అమెరికా వెళ్లాల్సిన వారు భారతదేశంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. హ్యూస్టన్‌కు చెందిన ఇమ్మిగ్రేషన్ లాయర్ ఎమిలీ న్యూమాన్ క్లయింట్లలో సుమారు 100 మందికి పైగా భారత్‌లో చిక్కుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. .

ALSO READ : గంటకు రూ.18 వేల సంపాదన

అయితే ఈ గందరగోళ పరిస్థితులకు దారితీసిన కారణాలను పరిశీలిస్తే.. ముందుగా ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త 'సోషల్ మీడియా వెట్టింగ్' పాలసీయే ఆలస్యాలకు అతిపెద్ద కారణమని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. వీసా అప్లికెంట్లు అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కాదని నిర్ధారించుకోవడానికి వారి సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా ఇమ్మిగ్రేషన్ అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో వీసాలను వేగంగా ప్రాసెస్ చేయడంపై దృష్టి పెట్టేవారు. కానీ ఇప్పుడు 'వేగం' కంటే 'పూర్తిస్థాయి తనిఖీ'కే ప్రాధాన్యత ఇస్తున్నామని స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి వెల్లడించారు. అలాగే డిసెంబర్ 15 నుండి H-1B వీసా హోల్డర్లతో పాటు వారిపై ఆధారపడిన H-4 వీసాదారులకు కూడా ఈ ఆన్‌లైన్ నిఘా తనిఖీలను వర్తింపజేసింది అమెరికా.

సెప్టెంబర్ 21 తర్వాత కొత్తగా H-1B వీసా అప్లై చేసే కంపెనీలు లేదా వ్యక్తులు లక్ష డాలర్ల భారీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే సెప్టెంబర్ 2 నుండి భారతీయులు ఇతర దేశాల్లో (కెనడా, మెక్సికో) వీసా రెన్యూవల్ చేసుకునే వెసులుబాటును కూడా రద్దు చేశారు. అందుకే కచ్చితంగా సొంత దేశానికే రెన్యూవల్ కోసం వీసా హోల్డర్లు నిబంధనల ప్రకారం ప్రస్తుతం రావాల్సి ఉంటుంది.

మొత్తం H-1B వీసా హోల్డర్లలో 71 శాతం మంది భారతీయులే ఉండటంతో ఈ తాజా పరిణామాలు ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. తమ ఉద్యోగుల కోసం కంపెనీలు ఎంత కాలం వేచి చూస్తాయని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే విమాన టిక్కెట్లు బుక్ చేసుకుని, అమెరికాలో అద్దె ఇళ్లు, ప్రాజెక్టు పనులు ఉన్నవారు ఇప్పుడు భారత్‌లో ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. తిరిగి యూఎస్ వెళ్లగలమా ఒకవేళ వెళితే దానికి ఎంత కాలం పడుతుంది అనే అనుమానాలు హెచ్1బి వీసా హోల్డర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి.