గంటకు రూ.18 వేల సంపాదన: పార్ట్ టైమ్ AI ట్రైనర్‌గా కోట్లు సంపాదించిన సీఈఓ

గంటకు రూ.18 వేల సంపాదన: పార్ట్ టైమ్ AI ట్రైనర్‌గా కోట్లు సంపాదించిన సీఈఓ

 యూకేలో స్థిరపడిన భారతీయ పారిశ్రామికవేత్త తన ఉత్సుకతను ఆదాయంగా మార్చుకుని.. గంటకు రూ.18వేలు సంపాదిస్తూ వార్తల్లో నిలిచారు. గ్లోబల్ మెంటార్‌షిప్ ప్లాట్‌ఫామ్ 'నెట్‌వర్క్ క్యాపిటల్' వ్యవస్థాపక సీఈఓ ఉత్కర్ష్ అమితాబ్(34) సక్సెస్‌ఫుల్ కెరీర్‌ను కొనసాగిస్తూనే, ఏఐ మోడల్స్‌కు శిక్షణ ఇస్తూ నెలకు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. 

 ఉత్కర్ష్ అమితాబ్ కేవలం డబ్బు కోసం కాకుండా..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంపై ఉన్న ఆసక్తితో 2025 జనవరిలో 'మైక్రో1' అనే డేటా లేబ్లింగ్ స్టార్టప్‌లో ఫ్రీలాన్స్ ట్రైనర్ గా చేరారు. రోజుకు కేవలం 3.5 గంటలు మాత్రమే ఈ పని కోసం కేటాయిస్తూ.. గంటకు సుమారు రూ.18వేల చొప్పున సంపాదిస్తున్నారు. కేవలం గత మూడు నెలల్లోనే బోనస్‌లతో కలిపి ఆయన దాదాపు రూ.2.6 కోట్లు సంపాదించటం విశేషం. రాత్రిపూట తన కూతురు నిద్రపోయిన తర్వాత ఈ 'సైడ్ హజిల్' చేయడం భాగంగా మారింది.

ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీలో మాస్టర్స్ చేసిన ఉత్కర్ష్‌కు ఏఐ రంగంలో మంచి పట్టు ఉంది. గతంలో మైక్రోసాఫ్ట్‌లో 6 ఏళ్ల పాటు క్లౌడ్, ఏఐ విభాగాల్లో పనిచేశారు. ప్రస్తుతం సంక్లిష్టమైన వ్యాపార సమస్యలను ఏఐ మోడల్స్‌కు ఇచ్చి.. అవి ఎక్కడ తడబడుతున్నాయో గుర్తించాలి. ఏఐకి సరైన దిశానిర్దేశం చేస్తూ.. అది మరింత ఖచ్చితంగా నేర్చుకునేలా ప్రోంప్ట్‌లను రీఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది పార్ట్‌టైమ్ జాబ్‌లో. 

తాను చేస్తున్న ఈ పని గురించి ఉత్కర్ష్ మాట్లాడుతూ.. ఇందులో తాను డబ్బు కంటే రీసెర్చ్ ఆసక్తికి దగ్గరగా ఉండటమే తనను నడిపించిందన్నారు. మెషిన్ నేర్చుకుంటున్న కొద్దీ నేను కూడా కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని తెలిపారు. 'మైక్రో1' సంస్థ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మంది నిపుణులతో నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. వీరు ఫార్చ్యూన్ 100 కంపెనీల ఏఐ మోడల్స్ నాణ్యతను పెంచడంలో పనిచేస్తున్నారు. ఒక బిజినెస్ మెన్ గా ఉంటూనే.. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీని నేర్చుకుంటూ ఆదాయాన్ని పొందుతున్న ఉత్కర్ష్ ప్రయాణం నేటి తరం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.