హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో వరుసగా చెక్ డ్యామ్‌లు కూలిపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ మేరకు చెక్ డ్యాములు కూలిపోవడంపై విజిలెన్స్ ఎంక్వయిరీకి ప్రభుత్వం ఆదేశించింది. గత నెల గుంపుల, రెండు రోజుల క్రితం అడవి సోమన్ పల్లి చెక్ డ్యామ్‌లు కూలిపోవడంపై ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మిస్తే చెక్ డ్యాములు ఎందుకు కూలుతున్నాయో అధికారుల క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని ఆదేశించారు. కూల్చుతున్నారా..? కూలిపోతున్నాయా..? నాణ్యత లోపంతో కుంగిపోతున్నాయా..? విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే అడవి సోమనపల్లి చెక్ డ్యామ్ కూలడంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇరిగేషన్ శాఖ అధికారులు. కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మానేరు నదిపై 16 చెక్ డ్యామ్‌లను రూ.128 కోట్లు ఖర్చు చేసి నిర్మించింది.
