హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు ప్రత్యేకించి పాలమూరు జిల్లాకు పెను శాపంగా మారిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలమూరుకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. ఆదివారం (డిసెంబర్ 21) తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
‘‘సమావేశం ప్రధాన ఎజెండా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ అంశం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుకు చేసిన ద్రోహంపైనే చర్చ జరిగింది. సమైక్య రాష్ట్రంలో ఎక్కువ అన్యాయానికి గురైన జిల్లా పాలమూరు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, 20 ఏళ్లు పాలించిన టీడీపీ పాలమూరు ద్రోహం చేశాయి. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు ప్రత్యేకించి పాలమూరు జిల్లాకు పెనుశాపంగా మారింది. పాలమూరు జిల్లాలో కృష్ణానది 300 కి.మీ మేర ప్రవహిస్తోంది.
జిల్లా మొత్తం కృష్ణా బేసిన్లోనే ఉంది. పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు 174 టీఎంసీల నీళ్లు రావాల్సి ఉంది. బచావత్ ట్రిబ్యునల్లో నీటి పంపకాలపై స్పష్టంగా ఉంది. అయినా మహబూబ్ నగర్ కు అన్యాయమే జరిగింది. పాలమూరు కోసం గంటెడు నీళ్లు అడిగివారే లేరు. పాలమూరు కరువుతో లక్షల మంది ముంబైకి వలస కట్టారు. పాలమూరులో చంద్రబాబు ఎన్నో పునాది రాళ్లు వేశారు. పాలమూరు గోసపై గోరటి వెంకన్నపై పాటలు కూడా రాశారు’’ అని అన్నారు.
గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి ఆనాడు పాలమూరు దిగజారిందని.. తెలంగాణ వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామన్నారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు ప్రాజెక్టుకు 90.81 టీఎంసీ కేటాయించమని గుర్తు చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు అసలు 170 టీఎంసీలు రావాలని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరుకు తొలి ప్రాధ్యాన్యత ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.
ఇందులో భాగంగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.27 వేల కోట్లు కేటాయించి.. 70, 80 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. మేం ఓడిపోయాక పాలమూరులో తట్టెడు మట్టి తీయలేదన్నారు. బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు శనిలా మారిందని.. మేం అధికారంలో ఉన్నన్ని రోజులు తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం కేంద్రంతో కొట్లాడామని గుర్తు చేశారు.
కేంద్రంలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని.. చంద్రబాబు ఏం చేప్తే కేంద్రం అది వింటుందని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కేంద్ర నుంచి వెనక్కి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఆనాడు వడ్లు కొనకపోతే కేంద్రాన్ని వణికించామన్నారు.
