కక్ష్యలోకి చంద్రయాన్-2

కక్ష్యలోకి చంద్రయాన్-2
  • చేరువగా   జాబిలి కక్ష్యలోకి చంద్రయాన్​2
  • కక్ష్య మార్పు సక్సెస్​ఫుల్​
  • వచ్చే నెల 7న విక్రమ్​ ల్యాండింగ్​
  • అసలు టెన్షన్​ ఇప్పుడే మొదలైందన్న ఇస్రో చైర్మన్​ శివన్​
  • మరో ముఖ్యమైన అడుగుపడిందని ప్రధాని ప్రశంస
చంద్రయాన్​ 2 ప్రయాణం సాఫీగా సాగిపోతోంది. ఎలాంటి అడ్డంకులూ లేకుండా నాన్​స్టాప్​గా జర్నీ చేస్తోంది. ఆ జర్నీలో భాగంగా కొద్ది రోజుల క్రితమే భూ కక్ష్యకు బైబై చెప్పిన చంద్రయాన్​2, తాజాగా చంద్రుడి కక్ష్యకు హాయ్​ చెప్పింది. మంగళవారం చంద్రయాన్​2 స్పేస్​క్రాఫ్ట్​ను విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి పంపింది ఇస్రో. దానికి అనుగుణంగా బుధవారం మరో సారి దాని కక్ష్యను మరోసారి మార్చనున్నారు. సెప్టెంబర్​ 3 వరకు నాలుగు సార్లు కక్ష్య మార్పులు చేసి, సెప్టెంబర్​ 7న ల్యాండర్​ విక్రమ్​ను చందమామపై దింపుతారు. కక్ష్య మార్పు సక్సెస్​ అవడంతో ఇస్రో సైంటిస్టులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు.

చంద్రయాన్​ 2 ప్రయాణం నాన్​స్టాప్​గా సాగుతోంది. ఏ అడ్డంకి లేకుండా సాఫీగా వడివడిగా చందమామవైపు పరుగులు పెడుతోంది. జాబిలికి నీడలా చందమామ కక్ష్యలోకి చేరిపోయింది. సోమవారం చంద్రయాన్​ 2ను విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి పంపించింది ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ). ఉదయం 9.02 గంటల నుంచి 1738 సెకన్ల పాటు చంద్రయాన్​2 ఇంజన్లను మండించి ‘చంద్ర కక్ష్య’ మార్పును చేసింది. చంద్రుడికి 18,072 కిలోమీటర్ల దూరంలో (అపోజీ), 114 కిలోమీటర్ల ఎత్తున చంద్రయాన్​2ను వదిలిపెట్టింది. తర్వాతి మార్పుల్లో భాగంగా చంద్రుడికి అతి దగ్గరగా చంద్రయాన్​2ను పంపనున్నారు ఇస్రో సైంటిస్టులు. 30 కిలోమీటర్ల అపోజీతో 100 కిలోమీటర్ల ఎత్తుకు దానిని పంపుతారు. ఆ తర్వాత ల్యాండర్​ విక్రమ్​ను దాని నుంచి వేరు చేసి చంద్రుడి దక్షిణ ధ్రువంపై దింపేందుకు ప్రయత్నిస్తారు. సెప్టెంబర్​ 7న చందమామపై విక్రమ్​ దిగుతుంది. బెంగళూరుకు సమీపంలోని బైలాలు వద్ద ఉన్న ఇండియన్​ డీప్​ స్పేస్​ నెట్​వర్క్​ (ఐడీఎస్​ఎన్​) సహకారంతో బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్​ అండ్​ కమాండ్​ నెట్​వర్క్​లో ఉన్న మిషన్​ ఆపరేషన్స్​ కాంప్లెక్స్​ నుంచి చంద్రయాన్​ 2 కక్ష్యను మార్చారు. ఎప్పటికప్పుడు దానిని అక్కడి నుంచే పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అది ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతోంది. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు మరోసారి చంద్రయాన్​2 కక్ష్యను మారుస్తారు. దాన్ని కలుపుకుని సెప్టెంబర్​ 7 లోపు నాలుగు సార్లు చంద్రయాన్​ 2 కక్ష్యను మారుస్తారు. చాలా వాయిదాల తర్వాత జులై 22న చంద్రయాన్​2 ప్రయోగాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.

గుండె ఆగినంత పనైంది

చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్​2ను పంపేటప్పుడు తమ గుండె ఆగినంత పనైందని ఇస్రో చైర్మన్​ కే శివన్​ అన్నారు. చంద్రయాన్​2 కక్ష్య మార్పు తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. స్పేస్​క్రాఫ్ట్​ ఇంజన్లను మండించి జాబిల్లి లైన్​లోకి నెట్టేటప్పుడు తమ గుండె వేగం బాగా పెరిగిందన్నారు. దాదాపు అరగంట పాటు మనసులో ఏదో ఒక అలజడి రేగుతూనే ఉందన్నారు. ఇప్పటిదాకా అంతా సాఫీగానే సాగినా సెప్టెంబర్​ 7వ తేదీని తలచుకుంటే కొంత భయంగా ఉందని, విక్రమ్​ దిగే ఆ చివరి 15 నిమిషాలే టెర్రర్​ టైం అని అన్నారు. ఇప్పుడు ఇస్రో సైంటిస్టులందిరలో టెన్షన్​ మరింత పెరిగిందే గానీ తగ్గలేదన్నారు. అయితే, ఎన్ని టెన్షన్లున్నా, భయాలున్నా కచ్చితంగా విక్రమ్​ను చందమామపై దింపే తీరుతామన్నారు. అందుకోసం ఇప్పటిదాకా చేయాల్సిన అన్ని టెస్టులు, సిమ్యులేషన్లు (చంద్రుడి వాతావరణాన్ని సృష్టించి ల్యాండింగ్​ చేయడాన్ని అనుకరించడం) చేశామని, సబ్​సిస్టమ్​లు, సిస్టమ్​లు, సెన్సర్​ల పనితీరును పరిశీలించామని శివన్​ తెలిపారు. ప్రయోగం సక్సెస్​ అవడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘చంద్రయాన్​2ను చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో టీంకు శుభాకాంక్షలు. చంద్రుడి దగ్గరకు వెళ్లే క్రమంలో మరో ముఖ్యమైన అడుగు ఇది” అని ఆయన ట్వీట్​ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్​ మహీంద్ర కూడా ఇస్రోను పొగుడుతూ ట్వీట్​ చేశారు. ‘‘ఈ ప్రయాణమే ఓ గమ్యం. మమ్మల్ని భాగం చేసిన ఈ ప్రయాణాన్ని చాలా ప్రేమిస్తున్నాం. ఇక్కడితో మీ ప్రయాణం ఆపొద్దు. తర్వాతి స్టాప్​ అంగారకుడే” అని ట్వీట్​ చేశారు.

ఆ పదిహేను నిమిషాలు..

  • ఒకటి: చంద్రుడిపై దిగడానికి నాలుగు రోజుల ముందు ఆర్బిటర్​ నుంచి విక్రమ్​ విడిపోతుంది. చంద్రుడికి 30 కిలోమీటర్ల ఎత్తులో 100 కిలోమీటర్ల దూరంలో గంటకు 6,120 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది.
  • రెండు: సెప్టెంబర్‌ 7న ల్యాండ్‌ అవుతున్న టైంలో 10 నిమిషాల 30 సెకన్ల తర్వాత చంద్రుడికి 7.4 కిలోమీటర్ల ఎత్తుకు చేరుతుంది. అప్పుడు దాని వేగం 526 కిలోమీటర్లకు తగ్గుతుంది.
  • మూడు: ఆ తర్వాత 38 సెకన్లలో దాని వేగం 331.2 కిలోమీటర్లకు పడిపోతుంది. చంద్రుడికి జస్ట్​ 5 కిలోమీటర్ల ఎత్తుకు చేరుతుంది.
  • నాలుగు: తర్వాత 89 క్షణాల్లో చంద్రుడికి అతి దగ్గరగా వెళుతుంది. కేవలం 400 మీటర్ల ఎత్తులోనే ఉంటుంది.
  • ఐదు: ఆ ఎత్తులో 12 సెకన్ల పాటు స్థిరంగా ఉండి చంద్రుడి మీద పరిస్థితులను సేకరిస్తుంది.
  • ఆరు: తర్వాతి 66 క్షణాల్లో 100 మీటర్ల ఎత్తుకు ల్యాండర్​ చేరుతుంది. 25 సెకన్ల పాటు అక్కడే స్థిరంగా ఉండి, ఎక్కడ దిగాలో విక్రమ్​ డిసైడ్​ అవుతుంది. దిగాలా, వేరే చోటుకు వెళ్లాలా అని నిర్ణయించుకుంటుంది.
  • ఏడు: 10 మీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత చందమామపై దిగడానికి 13 సెకన్ల టైం తీసుకుంటుంది విక్రమ్​. ఆ టైంలో 5 ఇంజన్లు ఒకేసారి మండుతాయి.
  • ఎనిమిది: విక్రమ్​ ల్యాండ్​ అవగానే ఇంజన్లు బందయ్యేలా సెన్సర్లు మెసేజ్​ పంపుతాయి.
  • తొమ్మిది: ల్యాండ్​ అయిన 15 నిమిషాల తర్వాత చంద్రుడిపై తీసిన ఫస్ట్​ ఫొటోలను భూమికి పంపుతుంది విక్రమ్​.
  • పది: ల్యాండ్​ అయిన నాలుగు గంటల తర్వాత రోవర్​ ప్రజ్ఞాన్​ బయటకొస్తుంది. చందమామపై కలియతిరుగుతూ డేటాను సేకరిస్తుంది.

దక్షిణ ధ్రువమే ఎందుకు?

ప్రస్తుతం చంద్రుడిపై ప్రయోగాలు చేస్తున్న చాలా దేశాలు దక్షిణ ధ్రువంవైపే  చూస్తున్నాయి. ఎందుకు? దానికి ఇస్రో సమాధానం చెప్పింది.

  • ఒకటి: కొన్ని వందల కోట్ల ఏళ్లుగా దక్షిణ ధ్రువంపై ఉన్న లోయల్లో సూర్యుడి వెలుతురన్నదే పడలేదు. కాబట్టి సౌర వ్యవస్థ పుట్టుకలోని విషయాలు చెక్కు చెదరకుండా ఉంటాయి.
  • రెండు: అంతా చీకట్లోనే ఉండే ఆ ప్రాంతంలో దగ్గరదగ్గర 10 కోట్ల టన్నుల నీళ్లుండే అవకాశం ఉంది.
  • మూడు: చందమామ నేలలో హైడ్రోజన్​, అమ్మోనియా, మీథేన్​, సోడియం, పాదరసం, వెండి ఆనవాళ్లున్నాయి. కాబట్టి కావాల్సిన వనరులు పుష్కలంగా ఉంటాయి.
  • నాలుగు: అక్కడ దొరికే మూలకాలు, అనువైన స్థలం కావడంతో భవిష్యత్​ ప్రయోగాలకు అదే మంచి వేదిక అవుతుంది.