అధికార పార్టీ లీడర్​ రైస్ మిల్లులో మోసం

అధికార పార్టీ లీడర్​ రైస్ మిల్లులో మోసం
  • ఎమ్మెల్యే మిల్లులనే కాంటా కొట్టిన్రు
  • అధికార పార్టీ లీడర్​ రైస్ మిల్లు వే బ్రిడ్జ్ లో మోసం  
  • టన్నుకు 28 కిలోలు తక్కువ చూపుతోంది
  • రెండు చోట్ల వెయిట్ చూసి మోసాన్ని తేల్చిన రైతులు 

జగిత్యాల, మల్లాపూర్, వెలుగు:  రైస్​మిల్లులకు పంపే వడ్ల తూకాల్లో మోసం జరిగినప్పుడు రైతులు అక్కడి ఎమ్మెల్యేలు, ఆఫీసర్లకు గోడు వెల్లబోసుకోవడం ఇప్పటిదాక చూశాం. కానీ ఓ ఎమ్మెల్యేకు చెందిన రైస్​మిల్లులోనే కాంటా కొట్టడంతో రైతులు తమకు జరిగిన అన్యాయాన్ని స్వయంగా తామే బయటపెట్టి, తహసీల్దార్​కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.   జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట్ ​శివారులో నిర్మల్​ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు రైస్ మిల్ ఉంది. బినామీ పేర్లతో నడుపుతున్నా తెరవెనుక వ్యవహారాలన్నీ ఎమ్మెల్యేనే చూసుకుంటున్నారు. కొత్తగా నిర్మిస్తున్న ఈ మిల్లు పనులు ఇంకా 60శాతం మాత్రమే పూర్తయ్యాయి. రూల్స్​ ప్రకారం ఈ మిల్లుకు వడ్ల కేటాయింపులు చేయవద్దు. కానీ సదరు లీడర్​ ఒత్తిళ్లతో  ఆఫీసర్లు మల్లాపూర్​మండలంలోని పలు సెంటర్లను కేటాయించారు. ఈ క్రమంలోనే సెంటర్ల నుంచి వచ్చే వడ్లలో తరుగు, వెయిట్​లాస్​ కింద భారీగా కోత పెడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. పోయిన నెల19న మల్లాపూర్​ ప్యాక్స్​సెంటర్​ నుంచి 915 బస్తాలను మిల్లుకు తరలించారు.  అందులో  ఏకంగా 73 బస్తాలను కట్ చేశారు.  అంతకుముందు ఇలాగే మూడు లారీలకు 50, 47, 35 బస్తాల చొప్పున కోత ​పెట్టారు. దీంతో రైతులకు  అనుమానం వచ్చి సెంటర్ నిర్వాహకులను నిలదీశారు.  వెయిట్​ లాస్​ కింద పోతోందని, డబ్బుల్లో కటింగ్​ తప్పదని చెప్పడంతో సుమారు 40 మంది రైతులు బుధవారం నేరుగా రంగంలోకి దిగారు. మొదట రైస్ మిల్ కు చెందిన వే బ్రిడ్జిపై ఖాళీ ట్రాక్టర్ ను ఉంచి వెయిట్​చూశారు. ఆ తర్వాత పక్కనే ఉన్న వే బ్రిడ్జిపై సేమ్​ ట్రాక్టర్ ​వెయిట్​చూడగా 90కిలోలు తేడా వచ్చింది. దీంతో  మోసపోతున్నామని తెలుసుకున్న రైతులు తహసీల్దార్ రవీందర్​కు బుధవారం కంప్లయింట్ ​ఇచ్చారు. ఇన్నిరోజులు తమ దగ్గర కటింగ్​పెట్టిన మొత్తం ధాన్యానికి ఖరీదు కట్టి ఇవ్వాలని, సదరు మిల్లు ఓనర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.