ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

పిల్లలతో పనిచేయిస్తే కఠిన చర్యలు

జనగామ అర్బన్, వెలుగు : పిల్లలతో పని చేయించినా, పిల్లలను పనిలోకి తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని బాలల హక్కుల కమిషన్ మెంబర్ శోభారాణి అన్నారు. బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గురువారం జనగామ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్​లో సర్పంచులు, ఎంపీపీలతో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో బాల్య వివాహాలు అరికట్టాల్సిన బాధ్యత ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. పిల్లలు ఆపదలో ఉంటే వారి రక్షణకు తోడ్పాటు అందించాలన్నారు. అనంతరం బాలల పరిరక్షణ కమిటీలకు సంబంధించిన పుస్తకాలను శోభారాణి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుమోహన్, డీడబ్ల్యూవో జయంతి, ఏసీపీ దేవేందర్ రెడ్డి, ఉప్పలయ్య, కవిత, శ్రీలత, సీఈవో వసంత, డీఆర్డీవో రాంరెడ్డి, లేబర్ ఆఫీసర్​కుమారస్వామి, డీఈవో కె. రాము, ఎంపీపీ చిట్ల జయశ్రీ తదితరులున్నారు.

ములుగులో ఆపరేషన్ స్మైల్ షురూ..

ములుగు: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ములుగు జిల్లాలో ఆపరేషన్ స్మైల్ ప్రోగ్రాంను పోలీసులు, ఆఫీసర్లు ప్రారంభించారు. గురువారం ములుగు జిల్లాకేంద్రంలోని సఖి సెంటర్ లో నిర్వహించిన మీటింగ్ లో డీఎస్పీ సుభాశ్ బాబు, డీడబ్ల్యూవో ప్రేమలత, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ జె.ఓంకార్ దీనిని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ..18 ఏండ్లలోపు పిల్లలను పనిలో చేర్చుకుంటే కేసులు పెడతామన్నారు. బడీడు పిల్లలు బడిలోనే ఉండేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలన్నారు. భిక్షాటన చేసే చిన్నారులను గుర్తించి, వారి కి రక్షణ కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఆపరేషన్ స్మైల్ ఇన్ చార్జి, సీఐ రవీందర్ తదితరులున్నారు.

గ్రామాల్లో బీజేపీని బలోపేతం చేయాలి

బచ్చన్నపేట, వెలుగు : గ్రామాల్లో బీజేపీని బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు జనగామ నియోజకవర్గ కన్వీనర్ బల్ల శ్రీనువాసు, ప్రభారి హరి శంకర్ గౌడ్ సూచించారు. గురువారం బచ్చన్నపేటలో నిర్వహించిన బీజేపీ మీటింగ్ లో వారు మాట్లాడారు. ఈ నెల 17న బీజేపీ సెంట్రల్ చీఫ్ జేపీ నడ్డా నిర్వహించే వర్చువల్ ప్రోగ్రాంకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలన్నారు. జనగామలోని జూబ్లీ గార్డెన్స్ లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

భద్రాద్రిలో కాషాయ జెండా ఎగరాలి..

వెంకటాపురం : వచ్చే ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరాలని, ఆ దిశగా పార్టీ నాయకులు కృషి చేయాలని బీజేపీ నియోజకవర్గ పాలక్ యాప సీతయ్య సూచించారు. గురువారం ములుగు జిల్లా వెంకటాపురంలో బీజేపీ మండల స్థాయి మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ.. ప్రజలంతా బీజేపీవైపే చూస్తున్నారని, ఏజెన్సీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. ఈ నెల 17న జరిగే జేపీ నడ్డా వర్చువల్ మీటింగ్ కు ప్రతి ఒక్కరూ హాజరుకావాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కుంజ సత్యవతి, నియోజకవర్గ కన్వీనర్ గులకోట త్రినాథరావు, ఎంపీపీ చెరుకూరి సతీశ్, మండలాధ్యక్షుడు రఘురాం ఉన్నారు.

ఫేస్ బుక్ లో కారు పేరుతో టోకరా
రూ.46వేలు దోచుకున్న సైబర్ నేరగాళ్లు
కస్టమర్ కేర్ పేరుతో మరోవ్యక్తి వద్ద దోపిడీ

కాజీపేట, వెలుగు : ఆన్ లైన్ ట్రేడింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నా జనం మాత్రం మోసపోతూనే ఉన్నారు. ఫేస్ బుక్ లో సైబర్ నేరగాళ్లు  ఓ కారు అమ్మకానికి పెట్టగా.. హోం డెలివరీ పేరుతో ఓ వ్యక్తి వద్ద  రూ.46,649 కొట్టేశారు. వివరాల్లోకి వెళితే.. కాజీపేట జూబ్లీ మార్కెట్ కు చెందిన ఓ వ్యక్తి.. ఫేస్ బుక్ లో తక్కువ ధరకే కారు అమ్మకానికి పెట్టడం చూశాడు. ఫోన్ లోనే రేటు మాట్లాడుకున్నాడు. అయితే కారు డెలివరీ కోసం రూ.46,649 ఖర్చు అవుతాయని చెప్పారు. ఇది నమ్మిన ఆ వ్యక్తి దశల వారిగా ఆన్ లైన్ లో డబ్బులు పంపించాడు. రోజులు గడుస్తున్నా కారు డెలివరీ కాకపోవడంతో మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే..
కాజీపేట సిద్దార్థనగర్ కు చెందిన ఓ వ్యక్తి ‘మేక్ మై ట్రిప్’ లో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. ఇది క్యాన్సిల్ చేసుకున్నా.. డబ్బులు మాత్రం రీఫండ్ రాలేదు. కస్టమర్ కేర్ కు కాల్ చేసినా, మెయిల్స్ పెట్టినా స్పందించలేదు. ఈక్రమంలో ఓ వ్యక్తి బాధితుడికి ఫోన్ చేసి, డబ్బులు రీఫండ్ రావాలంటే తాను చెప్పిన యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలన్నారు. ఇది నమ్మి ఇన్ స్టాల్ చేసుకోగా.. అకౌంట్ నుంచి రూ.19,500 కట్ అయ్యాయి. దీంతో బాధితుడు పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు.

మేడారం తల్లుల ఆశీస్సులతో అధికారంలోకి వస్తాం : ఎంపీ సోయం 

ములుగు, వెలుగు: మేడారం సమ్మక్క–సారలమ్మ తల్లుల ఆశీస్సులతో ములుగు నియోజకవర్గంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆదిలాబాద్ ఎంపీ, నియోజకవర్గ పాలక్ సోయం బాపూరావు ధీమా వ్యక్తం చేశారు. గురువారం ములుగు జిల్లాకేంద్రంలో నియోజకవర్గ కన్వీనర్ సిరికొండ బలరాం అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. బీజేపీ గెలుపు కోసం కార్యకర్తలు తీవ్రంగా శ్రమించాలన్నారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నారు. వెనుకబడిన ములుగు నియోజకవర్గంపై పాలకులు, ప్రజాప్రతినిధులకు పట్టింపు లేకుండా పోయిందన్నారు. ములుగును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి, జిల్లా ఇన్ చార్జి బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అజ్మీర కృష్ణవేణి నాయక్, గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ, రాష్ట్ర నాయకులు భూక్య రాజునాయక్, భూక్య జవహర్ నాయక్, జిల్లా పదాధికారులు నగరపు రమేశ్, గాజుల కృష్ణ, అడప భిక్షపతి, మందల విజయకుమార్ రెడ్డి తదితరులున్నారు.

మన్యంలోనూ అగ్రకులాల పెత్తనమేనా?

ఐనవోలు, వెలుగు : ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయ హుండీని గురువారం లెక్కించారు.  గతేడాది ఆగస్టు 30 నుంచి ఇప్పటివరకు వచ్చిన కానుకలు, టికెట్లను లెక్కించగా మొత్తం రూ.86లక్షల ఆదాయం సమకూరినట్లు ఈవో నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో నగదు రూ.8,63,608.. టికెట్ల రూపంలో రూ.77,39,894 ఆదాయం వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఎండోమెంట్ అబ్జర్వర్ అనిల్ కుమార్, ఐనవోలు ఎస్సై వెంకన్న, మహబూబాబాద్ కు చెందిన లక్ష్మీ వేంకటేశ్వర సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

భవిష్యత్తులో కేసీఆర్ ప్రధాని : ఎమ్మెల్యే సతీశ్ కుమార్

భీమదేవరపల్లి, వెలుగు : రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ ప్రధాని అవుతారని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో బీఆర్ఎస్ శ్రేణులతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాడు తెలంగాణ కోసం.. నేడు దేశం కోసం మరో పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి చెందిందన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. అనంతరం పలువురు గౌడన్నలు బీఆర్ఎస్ లో చేరారు. మీటింగ్​లో జడ్పీ చైర్మన్ డా.సుధీర్ కుమార్, ఎంపీపీ అనిత, జడ్పీటీసీ వంగ రవి, మండలాధ్యక్షుడు మహేందర్ రెడ్డి తదితరులున్నారు. అంతకుముందు ములుకనూరులో ప్రమోషన్ పై వెళ్తున్న హోమియో డాక్టర్​ గంగం గీతారాణిని ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు.