ఆమ్దానీ పెంచండి.. యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశం

ఆమ్దానీ పెంచండి.. యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశం
  • కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్ శాఖలపై ఫోకస్
  • రూ.10 వేల కోట్లు అదనంగా రాబట్టుకోవాలని కసరత్తు
  • ఆదాయానికి గండికొట్టే అక్రమ వ్యవహారాలపై నిఘా 

హైదరాబాద్, వెలుగు:  ఆర్థిక ఇబ్బందుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు సొంత ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం కసరత్తు మొదలుపెట్టింది. ఆదాయం పెంచుకుంటే అప్పులు తగ్గించుకోవడంతో పాటు సంక్షేమ పథకాల అమలుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నది. గత పదేండ్లలో ఎక్కడెక్కడ ప్రభుత్వ రాబడికి గండి పడిందో? రావాల్సినంత ఆదాయం రాలేదో? ఆయా శాఖలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఇందులో ప్రధానంగా కమర్షియల్​ ట్యాక్స్, స్టాంప్స్​ అండ్​రిజిస్ర్టేషన్స్, ఎక్సైజ్ శాఖలపై ఫోకస్ పెట్టింది. ఆదాయాన్ని పెంచుకునేందుకు యాక్షన్​ప్లాన్​రూపొందించాలని ఆయా శాఖల అధికారులను ఇప్పటికే ఆదేశించినట్టు తెలిసింది. ఈ మూడు శాఖల నుంచి కలిపి వచ్చే ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.10 వేల కోట్లు రాబట్టుకునేలా ముందుకువెళ్లాలని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా జరుగుతున్న అక్రమ వ్యవహారాలపైనా నిఘా పెట్టి, వాటిని అరికట్టాలని ఆదేశించింది.  

జీఎస్టీ వ్యవహారాలపై అలర్ట్.. ​

కమర్షియల్​ట్యాక్స్​లో ప్రధానంగా జీఎస్టీ ఆదాయంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. జీఎస్టీ చెల్లింపుల్లో నకిలీ ఇన్​వాయిస్​లు సృష్టించి, కొంతమంది ప్రభుత్వ రాబడికి గండికొడుతున్నారు. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌(ఐటీసీ)ను అక్రమ మార్గంలో కొల్లగొడుతున్నారు. దీంతో కమర్షియల్ ట్యాక్స్​కమిషనర్​గా సీనియర్​ఐఏఎస్​శ్రీదేవిని ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే ఎక్కడెక్కడా అక్రమాలు జరుగుతున్నాయో గుర్తించి, వాటిపై యాక్షన్​కు రెడీ అయ్యారు. గత సర్కార్​హయాంలో ఎవరెవరు? ఎలా? సర్కార్​ఆదాయానికి గండికొట్టారనే దానిపై ఎంక్వైరీ కూడా మొదలుపెట్టారు. పకడ్బందీగా జీఎస్టీ వసూళ్లను చేపట్టాలని, ఐటీసీ కొల్లగొట్టే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ప్రతినెల కనీసం రూ.200 కోట్లకు పైగా అదనంగా జీఎస్టీ సమకూరే అవకాశం ఉందని, అంటే ఏడాదికి రూ.2,500 కోట్ల మేర వస్తుందని అంచనా వేస్తున్నారు. జీఎస్టీ ఎగవేతలను కూడా ఆరికడితే ఇది మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. 

ఎల్ఆర్ఎస్ పై దృష్టి..  

స్టాంప్స్​అండ్​రిజిస్ర్టేషన్స్​శాఖలో ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. గత ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను సవరించి, రిజిస్ట్రేషన్​చార్జీలను పెంచింది. దీంతో కొంత ఆదాయం పెరిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి రియల్​ఎస్టేట్​కొంత డౌన్ కావడంతో రాబడి తగ్గింది. ఇప్పుడు ఎల్ఆర్ఎస్, నోటరీలపై జరిగిన అమ్మకాలు, కొనుగోళ్లకు స్టాంప్​డ్యూటీ కట్టించుకోవడంపై ప్రభుత్వం యోచన చేస్తున్నది. రియల్ ఎస్టేట్ ఊపందుకునేలా నిర్ణయాలు తీసుకుంటే.. అమ్మకాలు, కొనుగోళ్లు పెరుగుతాయని భావిస్తున్నది. వీటన్నింటి ద్వారా ఏడాదిలో యావరేజ్ గా రూ.3 వేల కోట్లు అదనంగా వస్తుందని లెక్క గడుతున్నది. 

కొత్తగా ఎలైట్ వైన్స్, బార్లు..  

ఎక్సైజ్ శాఖలో ఆదాయం పెంచుకునేందుకు ఎలైట్ వైన్స్, బార్లకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. వీటి ద్వారా ఫీజు రావడంతో పాటు మద్యం అమ్మకాలు కూడా పెరగనున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఈ ఎలైట్‌ వైన్స్‌ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వీటికి సాధారణ వైన్‌షాపుల కంటే కనీసం రెండింతలు, ఆపైన లైసెన్స్‌ ఫీజులను నిర్ణయించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. దీంతో అదనంగా రూ.4 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నది. మద్యం అక్రమ రవాణా, కల్తీ లిక్కర్​ ను ఆరికట్టడం ద్వారా రాబడి మరింత పెంచుకోవాలని భావిస్తున్నది.