సూర్యపేట జిల్లా మేళ్లచెరువులో రూ.48 కోట్ల బియ్యం పక్కదారి

సూర్యపేట జిల్లా మేళ్లచెరువులో రూ.48 కోట్ల బియ్యం పక్కదారి

మేళ్లచెరువు, వెలుగు : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు లోని ఓ రైస్ మిల్లులో 48 కోట్ల సీఎంఆర్ రైస్ పక్కదారి పట్టినట్లు ఆఫీసర్లు గుర్తించారు. మేళ్లచెరువు లోని శ్రీ శ్రీనివాస సాయి శివాయ రైస్ ఇండస్ట్రీలో రీజినల్ విజిలెన్స్ అధికారులు, సివిల్ సప్లై అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. పెద్ద మొత్తం లో రైస్ పక్కదారి పట్టినట్లు గుర్తించారు. 2022–-23 నుంచి  2024–-25 వరకు రబీ ధాన్యం, 2024–-25 ఖరీఫ్ సీజన్లలకు సంబంధించి 19,843.429 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు తేల్చారు.

అన్ లైన్ రికార్డుల్లో చూపిన ధాన్యం, మిల్లులో ఉన్న ధాన్యం మధ్య భారీ తేడాలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. కనిపించని ధాన్యం విలువ రూ.48 కోట్లుగా అంచనా వేశారు. 2022–-23 రబీ సీజన్ కు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయి కూడా 5.66 కోట్లు ఉందని తెలిపారు. ఈ రైస్ ఇండస్ట్రీ ప్రభుత్వానికి మొత్తంగా 53.66 కోట్ల మేర నష్టం కలిగించినట్లు చెప్పారు. పూర్తి స్థాయి విచారణ తర్వాత తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసి, చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీల్లో  రీజనల్ విజిలెన్స్ అధికారి ప్రతాప్, సీఐ గౌస్, సివిల్ సప్లై అధికారులు, టెక్నికల్ సిబ్బంది 
పాల్గొన్నారు.