CO2 కొంచెమే.. ఎఫెక్ట్ భూగోళమంత!

CO2 కొంచెమే..  ఎఫెక్ట్ భూగోళమంత!

భూమిని బాగా వేడెక్కిస్తున్న కార్బన్‌డై ఆక్సైడ్‌

కొంచెం పెరిగినా విపత్తేనంటున్న సైంటిస్టులు

మన అట్మాస్పియర్ లో కార్బన్ డయాక్సైడ్ వాయువు ఉండేదే పిసరంత. మొత్తం అట్మాస్పియర్ లో సీఓటూ శాతం కేవలం 0.041మాత్రమే. మరి.. ఇంత తక్కువగా ఉన్న సీఓటూ ఇంత పెద్ద భూగోళాన్ని ఎలా వేడిక్కించగలుగుతోంది? వాతావరణంలో నైట్రోజన్ 78.09 శాతం, ఆక్సిజన్ 20.95 శాతం  ఉంటాయి. రెండూ కలిపితే 99.04 శాతం అవుతాయి. ఇంత ఎక్కువగా ఉన్నా, ఈ రెండు వాయువులు భూమిని ఎందుకు వేడెక్కించడం లేదు? వీటికి ఆన్సర్లు తాను చెబుతానంటున్నారు యూనివర్సిటీ ఆఫ్​ నార్త్ కరోలినా ఎన్విరాన్ మెంటల్​సైన్సెస్ ప్రొఫెసర్ జాసన్ వెస్ట్. ఆయన ఇదే విషయంపై సైన్స్ వెబ్ సైట్ ‘ద కన్వర్షన్’ లో ఇటీవల ఆర్టికల్ రాశారు. అందులో సీఓటూ గురించి అనేక రీసెర్చ్​లలో తేలిన విషయాలు వెల్లడించారు. వాతావరణ మార్పులో సీఓటూ పాత్రను సైంటిస్టులు1850లలోనే గుర్తించారని, దాని గురించి ఎన్నో విషయాలు తెలిసి ఆశ్చర్యపోయారని వివరించారు.

భూమి ఎందుకు వేడెక్కుతుంది?

సూర్యుడి నుంచి కాంతి భూమిపై పడుతుంది. దీనివల్ల భూమి ఉపరితలం వేడెక్కుతుంది. తర్వాత భూమి కొంత వేడిని తిరిగి అంతరిక్షంలోకి వదిలేస్తుంది.  సూర్యుడు చాలా వేడిగా ఉంటాడు. అందుకే సూర్యుడి నుంచి ఎనర్జీ అల్ట్రా వయెలెట్, విజిబుల్ లైట్ (షార్ట్ వేవ్ రేడియేషన్) రూపంలో భూమిని చేరుతుంది. భూమి చల్లగా ఉంటుంది. కాబట్టి భూమి నుంచి వేడి ఇన్ ఫ్రారెడ్ రేడియేషన్ (లాంగ్ వేవ్ రేడియేషన్) రూపంలో అంతరిక్షంలోకి విడుదలవుతుంది. కానీ, సూర్యుడి నుంచి భూమికి చేరే ఎనర్జీతో పోలిస్తే.. మన భూగోళంపై ఉండాల్సిన దాని కంటే 33 డిగ్రీ సెంటిగ్రేడ్ల టెంపరేచర్ ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అంటే.. భూమి వదిలేస్తున్న వేడి అంతరిక్షంలోకి పోకుండా వాతావరణంలోనే ఉండిపోతోందన్నమాట!

2100 నాటికి 0.1 శాతానికి సీఓటూ

భూమి ఉపరితల సగటు టెంపరేచర్లు1880 నుంచి ఇప్పటివరకు1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగింది. మనుషులు చేసిన పనుల వల్ల సీఓటూ, ఇతర వేడిని పట్టి ఉంచే వాయువులు పెరగడమే ఇందుకు కారణమని జాసన్ వెస్ట్ తెలిపారు. ప్రస్తుతం అట్మాస్పియర్ లోకి చేరుతున్న కార్బన్ డయాక్సైడ్ లో మనుషుల వల్ల ఉత్పత్తి అవుతున్నది32 శాతమేనని, అయినా సీఓటూ స్వల్పంగా పెరిగినా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తాయన్నారు. సీఓటూ ఉద్గారాలను కంట్రోల్ చేయకపోతే.. అట్మాస్పియర్ లో సీఓటూ లెవెల్ 2100 సంవత్సరం నాటికి 0.1 శాతానికి పెరుగుతుందని, అప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల ఎన్నో వైపరీత్యాలు జరుగుతాయని చెప్పారు.

డిసైడ్చేసేది సీఓటూనే

అట్మాస్పియర్ లో చాలా స్వల్పంగా ఉండే నీటి ఆవిరి, సీఓటూ, కార్బన్ మోనాక్సైడ్, ఇతర వాయువులన్నీ.. భూమి విడుదల చేసే రేడియేషన్ ను పీల్చుకుంటాయని, అందుకే వేడి అంతరిక్షంలోకి పోకుండా భూమి టెంపరేచర్లు పెరుగుతున్నాయని జాసన్ వెస్ట్ పేర్కొన్నారు. ఈ వాయువుల నిర్మాణంలో మూడు కన్నా ఎక్కువ ఆటమ్స్ ఉండటం వల్ల ఇవి లాంగ్ వేవ్ రేడియేషన్ ను పీల్చుకుంటాయని, నైట్రోజన్, ఆక్సిజన్‌లలో రెండు ఆటమ్స్ మాత్రమే ఉండటం వల్ల అవి వేడిని పీల్చుకోవని వివరించారు. అంతేకాకుండా.. అట్మాస్పియర్లో వేడిని పీల్చుకునే నీటి ఆవిరి, ఇతర వాయువులు కింది పొరల్లోనే ఉంటాయని, సీఓటూ మాత్రం పై పొరల్లోకి చేరుతుందన్నారు. దీనివల్ల అప్పర్ అట్మాస్పియర్ ప్రాంతం నుంచి భూమి రేడియేషన్ అంతరిక్షంలోకి ఎంత రిలీజ్ కావాలన్నది డిసైడ్ చేయడంలో సీఓటూదే కీలక పాత్రగా మారుతుందన్నారు. అందుకే.. సీఓటూ అతి స్వల్పంగా పెరిగినా పెను విపత్తు తప్పదని ఆయన హెచ్చరించారు.