నల్గొండ, వెలుగు : నల్గొండలోని గొల్లగూడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన గొల్లగూడలోని ఇండ్ల సముదాయాన్ని పరిశీలించి, గదుల్లో అద్దాలు, ఎలక్ట్రికల్ వైరింగ్, విండోలు, వాటర్ ట్యాంకులు, నీటి ట్యాపులు, లైటింగ్, తలుపులు, బాత్రూములు, కిచెన్ పనులను పూర్తి చేయాలని చెప్పారు.
గృహ సముదాయం మొత్తాన్ని శుభ్రపరచాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించడంతో పాటు, నివాసితులకు అవసరమైన జిమ్, పార్కులు, బస్తీ దవాఖాన, అంగన్‌వాడీ కేంద్రం, జిరాక్స్ సెంటర్, మీ సేవా కేంద్రం, మెడికల్ షాప్, కూరగాయల దుకాణాలు, లే అవుట్ బోర్డులు ఏర్పాటు చేయాలని హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్‌కు సూచించారు. పరిసర ప్రాంతాల్లో సీసీ రోడ్లు, అంతర్గత రహదారులు, వైకుంఠధామం, క్రీడా మైదానం లాంటి మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రజలకు నాణ్యమైన వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.
