మోగుతున్న డేంజర్ బెల్స్ .. భయపెడుతున్న కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్

మోగుతున్న డేంజర్ బెల్స్ .. భయపెడుతున్న కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్

న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం తెలిసిందే. వైరస్ సమూహ వ్యాప్తి మొదలవడం భయాందోళనలు కలిగిస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య మిలియన్ మార్కును దాటింది. అమెరికా, బ్రెజిల్ తర్వాత పాజిటివ్ కేసుల్లో ఇండియా మూడో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో పరిస్థితి దిగజారుతోందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలిపింది.

‘ఇది ఘోరమైన వృద్ధిగా చెప్పొచ్చు. ప్రతి రోజూ 30 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇది నిజంగా దారుణమైన పరిస్థితి’ అని ఐఎంఏ హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ ఇండియా డాక్టర్ వీకే మోంగా చెప్పారు. కేసులు క్రమంగా టౌన్‌లు, విలేజ్‌ల్లోకి వెళ్లుతోందని, అక్కడ దాన్ని నియంత్రణలోకి తీసుకురావడం కష్టమని మోంగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఢిల్లీలో వైరస్‌ను కంట్రోల్ చేయగలిగాం. కానీ దేశ అంతర్గత భాగాలైన మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, గోవా, మధ్యప్రదేశ్ పరిస్థితి ఏంటి’ అని ఆయన ప్రశ్నించారు. కరోనా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌పై తొలుత స్పందించినది కేరళ సీఎం పినరయ్ విజయన్‌. తిరువనంతపురం జిల్లాలోని తీర ప్రాంతాల్లో కరోనా సమూహ వ్యాప్తి అవుతోందని విజయన్ శుక్రవారం పేర్కొన్నారు. టెస్టింగ్ ఫెసిలిటీస్‌ను తరచుగా పెంచుతున్నామని ఐసీఎంఆర్ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 885 గవర్నమెంట్ లేబొరేటరీలు, 368 ప్రైవేటు లేబొరేటరీలు కరోనా టెస్టులు చేస్తున్నాయని ఐసీఎంఆర్ చెప్పింది.