వరంగల్ సిటీలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు స్పీడప్

 వరంగల్ సిటీలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు స్పీడప్
  • ఏండ్ల నాటి సమస్యలకు చెక్
  • రూల్స్ కఠినంగా అమలు
  • నంబర్ ప్లేట్ లేకుంటే కేసులు
  • వారం రోజుల్లోనే 68 మందిపై కేసులు

 

వరంగల్‍, హనుమకొండ, వెలుగు:వరంగల్ సిటీలో ట్రాఫిక్ నియంత్రణపై సీపీ ఏవీ రంగనాథ్ ప్రత్యేక దృష్టిసారించారు. గతంలో హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా పనిచేసిన అనుభవంతో..  ఇక్కడ కూడా ట్రాఫిక్ కంట్రోల్ కు చర్యలు ప్రారంభించారు. ఏండ్ల నాటి ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతున్నారు. ఒక్కో జంక్షన్​ను.. ఒక్కో ఆఫీసర్​కు కేటాయించి మరీ పనులు చేయిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ రూల్స్ ను కూడా కఠినంగా అమలు చేస్తున్నారు. నంబర్ ప్లేట్ లేకుంటే చీటింగ్ కేసులు నమోదు చేస్తున్నారు.

20 జంక్షన్ల గుర్తింపు..

మొదటి దశలో గ్రేటర్‍ వరంగల్‍ పరిధిలో ఎక్కువ ట్రాఫిక్‍ జామ్‍ అయ్యే 20 జంక్షన్లపై సీపీ ఫోకస్ పెట్టారు. ఇందులో ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చి న వాటికి ప్రయారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు పెగడపల్లి డబ్బాలు, అంబేడ్కర్‍ జంక్షన్‍, వరంగల్‍ బట్టల బజార్‍ వంటి ఏరియాల్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్‍ పెట్టారు. చిరు వ్యాపారాలు, అడ్డా కూలీలకు ప్రత్యామ్నాయ చోటు చూపిస్తున్నారు. షాప్‍ ఓనర్లు, ఆటో యూనియన్లతో  మీటింగ్స్ పెట్టి, ట్రాఫిక్ సమస్యపై అర్థమయ్యేలా వివరిస్తున్నారు. వినని వారి పట్ల కఠినంగా ఉంటూ అడ్డుగా ఉండే బోర్డులు తీసేస్తున్నారు. ఇష్టారీతిన పార్కింగ్ చేసే వాహనాలకు ఫైన్లు విధిస్తున్నారు. 

చీటింగ్‍ కేసులే..

జనవరి ఫస్ట్ నుంచి నంబర్‍ ప్లేట్‍ లేని వాహనాల ఓనర్లపై చీటింగ్‍ కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే సీపీ హెచ్చరించగా.. వారం రోజుల్లోనే 68మందిపై కేసులు ఫైల్ అయ్యాయి. ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్‍ ప్లేట్లు వాడినా.. నంబర్‍ కనపడకుండా మాస్కులు పెట్టినా కేసులు పెడుతున్నారు. హెల్మెట్ లేకుంటే, సీటు బెల్ట్ పెట్టుకోకుంటే చలాన్లు వేస్తున్నారు. ఈనెల 18 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే వెహికల్స్ సీజ్ చేయనున్నారు.

వాట్సాప్‍ గ్రూప్‍లపై సీరియస్‍

సిటీలోని ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‍ సిబ్బంది ఫైన్లు రాస్తున్న విషయాన్ని ఇతరులకు తెలిపేలా కొందరు వ్యక్తులు ప్రత్యేక వాట్సాప్‍ గ్రూపులు క్రియేట్‍ చేశారు. ఈ గ్రూపుల్లో వందలాది మంది కాలేజీ స్టూడెంట్లు, ఉద్యోగులు ఉన్నారు. ట్రాఫిక్‍ సిబ్బంది  ఫైన్లు వేస్తున్నట్లు కనబడితే వెంటనే ఆ సమాచారాన్ని గ్రూపుల్లో వేస్తున్నారు. ఈ విషయం సీపీకి తెలియడంతో గ్రూప్‍ అడ్మిన్లపై కన్నువేశారు. దీంతో ఒక్కొక్కరుగా అందులోనుంచి ఎగ్జిట్‍ అవుతున్నారు. 

ఫీల్డ్ మీదకు సీపీ..

రోడ్డు ప్రమాదాల నివారణకు సైతం సీపీ చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగే చోట్లకు తానే స్వయంగా పరిశీలిస్తున్నారు. స్పీడ్​బ్రేకర్లు, సెంట్రల్‍ లైటింగ్‍, డివైడర్ల ఏర్పాటుకు స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నారు. ఇదిలా ఉండగా శనివారం ట్రాఫిక్‍ ఏసీపీ మధుసూదన్‍ ఆధ్వర్యంలో సీఐలు రవికుమార్‍, బాబులాల్‍ ఆటో యూనియన్లు, ఆర్టీసీ డ్రైవర్లతో ‘రక్షణ’ పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

యువకుడి మెసేజ్ తో..

హనుమకొండ కేయూ జంక్షన్‍ నుంచి ములుగు రోడ్డుకు వెళ్లే రూట్​లో హనుమాన్‍నగర్‍(పెగడపల్లి డబ్బాలు) అనేది పెద్ద సెంటర్‍. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. పెగడపల్లి, ముచ్చర్లనాగారం, సూదన్‍పల్లి, అంబాల, సీతానాగారం, గుండ్లసింగారం, ఇందిరమ్మకాలనీ, ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, పలివేల్పులతో పాటు పదుల సంఖ్యలో కొత్త కాలనీల జనాలు, వ్యాపారులు  సిటీలోకి ఎంటరయ్యేందుకు ఇదే మెయిన్ రూట్. ఇక్కడ దాదాపు 20 ఏండ్లుగా  ట్రాఫిక్‍ జామ్‍ అవుతోంది. దీంతో ఓ యువకుడు ఈ సమస్యను సీపీకి వాట్సాప్ చేశారు. స్పందించిన ఆయన ట్రాఫిక్‍ అధికారులకు పిలిపించి పలు సూచనలు చేశారు. ట్రాఫిక్‍ ఎస్సై శ్రీకాంత్‍ తన సిబ్బందితో జంక్షన్​లో అవేర్ నెస్ కల్పించారు. ఆటో యూనియన్లు, చిరు వ్యాపారులు, షాప్‍ ఓనర్లతో మాట్లాడారు. లేబర్‍ అడ్డా, కూరగాయల విక్రయాలను పక్కనే ఉన్న దాసాంజనేయ గుడి స్థలంలోకి మార్చారు. సమాచారం తెలిపేలా డిపార్టుమెంట్‍ తరఫున సెంటర్లో ఫెక్సీలు కట్టారు. షిష్ట్​ల వారిగా ఇద్దరు ఎస్సైలు, 10 మంది సిబ్బంది అక్కడే ఉండి 20 ఏండ్ల 
సమస్యను కేవలం రెండ్రోజుల్లో పరిష్కరించారు.


ఈ నెల 18 నుంచి.. డ్రైవింగ్‍ లైసెన్స్ లేకుంటే బైక్‍ సీజ్‍

  మైనర్లు నడిపితే కోర్టులో తల్లిదండ్రులపై  చార్జ్ షీట్‍: సీపీ ఏవీ రంగనాథ్​
వరంగల్‍ కమిషనరేట్‍ పరిధిలో ఈ నెల 18 నుంచి డ్రైవింగ్‍ లైసెన్స్ లేకుండా రోడ్లపై నడిపే బైకులను సీజ్‍ చేయనున్నట్లు వరంగల్‍ పోలీస్‍ కమిషనర్‍ ఏవీ.రంగనాథ్‍ తెలిపారు. రోడ్డు యాక్సిడెంట్లు తగ్గించడానికితోడు ప్రతి ఒక్కరు ట్రాఫిక్‍ రూల్స్ పాటించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. డ్రైవింగ్‍ లైసెన్స్ లేకుంటే బైక్‍ సీజ్‍ చేసి పోలీస్‍ స్టేషన్‍కు తరలించి.. మోటార్‍ వెహికల్‍ యాక్ట్ 180, 181 ప్రకారం 
కోర్టులో చార్జ్​షీట్‍ ఫైల్ చేస్తామన్నారు.లైసెన్స్ చూపిస్తేనే వెహికల్స్ ఇస్తామన్నారు. మైనర్లు బండ్లు నడిపితే తల్లిదండ్రులపై, జువైనల్‍ కోర్టులో మైనర్లపై చార్జీ షీట్ వేస్తామన్నారు.