ఇంజినీరింగ్​లో...కంప్యూటర్ సైన్స్​కే క్రేజ్

ఇంజినీరింగ్​లో...కంప్యూటర్ సైన్స్​కే క్రేజ్
  • కన్వీనర్ కోటాలో మొత్తం సీట్లు 76,359
  • అందులో 67 శాతం కంప్యూటర్, 
  • అనుబంధ కోర్సులవే ఇంజినీరింగ్  కాలేజీల్లో సీట్లను
  • ప్రకటించిన విద్యా శాఖ ఏటా తగ్గుతున్న మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ సీట్లు

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్య తీరు మారుతున్నది. ఒకప్పుడు  ఇంజినీరింగ్  అంటే సివిల్, మెకానికల్, ఎలక్ర్టానిక్స్  కోర్సులు ఉండేవి. కానీ, ప్రస్తుతం కంప్యూటర్  సైన్స్  ఒక్కటే ఇంజినీరింగ్ అన్నట్టుగా మారింది. సర్వీస్  సెక్టార్​గా ఉన్న కంప్యూటర్  ఎడ్యుకేషన్.. తాజాగా ఇంజినీరింగ్​లో కలిసిపోయింది. ఇంజినీరింగ్ లో  సంప్రదాయ కోర్సులుగా ఉన్న సివిల్, మెకానికల్, ఎలక్ర్టానిక్స్  బ్రాంచుల్లో మూడేండ్లుగా సీట్లు తగ్గుతుండగా,  కంప్యూటర్  సైన్స్​లో మాత్రం సీట్లు భారీగా పెరుగుతున్నాయి. 

దీనిపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో  2023–24  విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్  సీట్ల వివరాలను విద్యా శాఖ ఆదివారం ప్రకటించింది. రాష్ట్రంలో 173 ఇంజినీరింగ్  కాలేజీల్లో 1,07,039 సీట్లున్నాయని, వాటిలో 16 సర్కారు కాలేజీలు, వాటి అనుబంధ కాలేజీల్లో 4,773 సీట్లున్నాయని విద్యా శాఖ తెలిపింది. అత్యధికంగా జేఎన్టీయూ పరిధిలో 138 కాలేజీల్లో 88,972  సీట్లున్నాయని వెల్లడించింది. మొత్తం కన్వీనర్  కోటాలో  76,359 సీట్లున్నాయని విద్యా శాఖ పేర్కొంది. అయితే, వాటిలో 67శాతం సీట్లు కేవలం కంప్యూటర్ సైన్స్, ఐటీ రిలేటెడ్  కోర్సుల్లోనే ఉన్నాయని తెలిపింది. ఆయా కోర్సుల్లో 51 వేలకు పైగా సీట్లున్నాయి. ‘‘మొత్తం 53 బ్రాంచులు ఉండగా వాటిలో అత్యధికంగా కంప్యూటర్ సైన్స్  అండ్ ఇంజినీరింగ్ లో 21,503 సీట్లు, సీఎస్ఈ (ఏఐ అండ్ ఎంఎల్) లో 11,094 సీట్లు ఉన్నాయి.

ఎలక్ర్టానిక్స్ అండ్  కమ్యూనికేషన్  ఇంజినీరింగ్ (ఈసీఈ) లో 11,013 సీట్లు, సీఎస్ఈ డేటా సైన్స్ లో 6567, ఐటీలో 4860, ఎలక్ర్టికల్  అండ్  ఎలక్ర్టానిక్స్  ఇంజినీరింగ్ లో 4632,  సివిల్  ఇంజినీరింగ్​లో 3777 సీట్లు ఉన్నాయి. అయితే, ఎంసెట్ అడ్మిషన్  కౌన్సెలింగ్  ప్రారంభంలో పది రోజుల క్రితం 155 కాలేజీల్లో 62,079 సీట్లు మాత్రమే కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉండె” అని విద్యా శాఖ తెలిపింది. ఇక జేఎన్టీయూ నుంచి మరికొన్ని కాలేజీలకు అనుమతులు రావడంతో పాటు, కొత్తగా 14 వేలకు పైగా సీట్లకు సర్కారు ఆమోదం తెలపడంతో ఇంజినీరింగ్​లో సీట్లు భారీగా పెరిగాయి. సీట్ల పెంపుతో పాటు ఇంటర్  అడ్వాన్స్ డ్  సప్లిమెంటరీ ఫలితాలు రావడంతో ఎంసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్  షెడ్యూల్​ను మార్చారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తిచేసుకున్న విద్యార్థులు ఈనెల12 వరకూ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఇప్పటి వరకూ 82 వేల మంది వరకూ ఫీజు చెల్లించి స్లాట్  బుక్  చేసుకోగా, వారిలో 66,215 మంది స్టూడెంట్లు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. 

తగ్గుతున్న సంప్రదాయ కోర్సుల సీట్లు

ఇంజినీరింగ్​లో ఒకప్పుడు వెలుగు వెలిగిన సివిల్, మెకానికల్, ఎలక్ర్టానిక్స్  బ్రాంచులు ప్రస్తుతం డిమాండ్ లేక వెలవెలబోతున్నాయి. ఈ సంవత్సరం ఏకంగా ఆయా కోర్సుల్లోని ఏడువేలకుపైగా సీట్లను మేనేజ్ మెంట్లు తగ్గించాయి. ఆ సీట్ల స్థానంలో ఐటీ, కంప్యూటర్  సైన్స్  దాని అనుబంధ బ్రాంచుల్లో సీట్లు మార్చుకున్నాయి. కొత్తగా సర్కారు పర్మిషన్  ఇచ్చిన మరో ఏడువేల సీట్లను అవే బ్రాంచుల్లో తీసుకున్నారు. కొన్ని కాలేజీలు నామమాత్రంగా సివిల్, మెకానికల్, ఎలక్ర్టానిక్స్  కోర్సుల్లో 30 సీట్లు మాత్రమే పెట్టుకున్నాయి. అయితే, ఇది ప్రమాదకరమైన పరిస్థితి అని, దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. సంప్రదాయ కోర్సుల ప్రాధాన్యతను విద్యార్థుల్లోకి తెలుసుకోవాలని, అప్పుడే ఆ కోర్సులకు డిమాండ్  నెలకొనే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.