కూరగాయలు అమ్ముతున్న వరల్డ్‌కప్‌ విన్నర్‌ నరేష్‌ తుంబా

కూరగాయలు అమ్ముతున్న వరల్డ్‌కప్‌ విన్నర్‌ నరేష్‌ తుంబా

కరోనా సృష్టించిన కల్లోలానికి ప్రజల జీవితాలే తారుమారైయ్యాయి. కొందరి ఉద్యోగాలు ఊడిపోతే…మరికొందరికి రోజువారి పనుల్లేక బతుకు భారమైంది. దీంతో పట్టణాల నుంచి తమ సొంత గ్రామాల బాట పట్టారు. కరోనా ఎఫెక్ట్ ఉద్యోగాలు..పనుల మీదనే కాదు.. అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది.  ముఖ్యంగా కరోనా వైరస్‌ దెబ్బకి క్రికెట్ మ్యాచ్ లు రద్దయ్యాయి. దీంతో ఆదాయం లేని క్రికెటర్లు వేరే పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గుజరాత్ కి చెందిన భారత అంధుల క్రికెట్‌ జాతీయ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన నరేష్‌ తుంబా(29) అనే క్రికెటర్ కూరగాయల వ్యాపారిగా మారాడు. అహ్మదాబాద్‌ సమీపంలోని జమల్‌పూర్‌ మార్కెట్‌ లో కూరగాయలు అమ్ముతున్నాడు.

2018లో షార్జా వేదికగా జరిగిన అంధుల వరల్డ్ కప్ టీమ్‌లో నరేష్‌ కీలక పాత్ర పోషించాడు. లీగ్‌లో మ్యాచ్ ల్లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్‌ జట్టు విజయం సాధించి ప్రపంచ కప్‌ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. దీంతో అతని పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.  అయితే కరోనా అతని జీవితాన్ని అంధకారంలోకి నెట్టింది. కరోనా విపత్తు కారణంగా క్రికెట్‌కు తాత్కాలిక బ్రేక్‌ పడటంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. బతుకుదెరువు కోసం కుటుంబ సభ్యుల సహకారంతో కూరగాయల వ్యాపారం ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న పలువురు క్రీడాభిమానులు.. భారత క్రికెట్‌ యాజమాన్యం అతడిని ఆదుకోవాలని కోరుతున్నారు.