ఆదివాసీల సాగు భూములకు పట్టాలు ఇవ్వాలి

ఆదివాసీల సాగు భూములకు పట్టాలు ఇవ్వాలి

ఎంతో కాలంగా అడవులను ఆధారంగా చేసుకొని జీవనం సాగిస్తున్న ఆదిమ గిరిజనులు సాగు చేస్తున్న భూములకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలివ్వాలన్నారు ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, అదిలాబాద్ ఎంపీ సోయం బాబు రావు . రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైని కలిశారు సోయం బాబురావు. ఆదివాసీల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఆ తర్వాత మాట్లాడిన ఆయన ఒక్క ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోనే 64 వేల మంది ఆదివాసీ గిరిజన రైతుల పట్టాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదన్నారు. భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడిన కొమురం భీం ఆశయాలను నెరవేర్చాలన్నారు.

అంతేకాదు 1976 తర్వాత వలస వచ్చిన వారికి….స్థానికత ఆధారంగా అధికారులు సర్వే చేసి కులం సర్టిఫికెట్ జారీ చేయాలన్నారు సోయం బాబురావు. ITDAలకు నిధులు మంజూరు చేసి ఆర్ధికంగా వాటిని ఆదుకోవాలన్నారు. ఉద్యోగ ఉపాధి విద్యా రంగాలలో ఆదివాసీలకు షెడ్యూల్ ఏరియాల్లో 100 % శాతం రేజర్వేషన్లు కల్పించాలని చెప్పారు. ఆదివాసీ దుర్భర జీవితాలను వారి స్థితిగతులను తెలుసుకోవడానికి చారిత్రక  ప్రాంతాలైన  జోడేఘాట్, ఇంద్రవెల్లి , మార్లవాయి  క్షేత్రాలను గవర్నర్ ను  సందర్శించాలని ఆహ్వానించామని తెలిపారు సోయం బాబు రావు.