కరోనాతో హాస్పిటల్​లో ఉన్నా.. ప్లీజ్ మనీ పంపండి

కరోనాతో హాస్పిటల్​లో ఉన్నా.. ప్లీజ్ మనీ పంపండి


ప్రైవేటు టీచర్ అశోక్​కు రెండ్రోజుల క్రితం తెలిసిన వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. ‘సార్..మీ హెల్త్ ఎలా ఉంది..హాస్పిటల్ బిల్ కట్టారా’ అని అవతలి వ్యక్తి అడిగాడు. ‘నేను బాగానే ఉన్నా, హాస్పిటల్ బిల్ ఏంటి’ అని అశోక్ సమాధానం ఇచ్చాడు. ‘మీకు కరోనా వచ్చిందని, ఆర్థిక సాయం కావాలని ఫేస్ బుక్ నుంచి మెసేజ్ చేశారు కదా..మీరు పంపిన నంబర్ కి రూ.10 వేలు  గూగుల్ పే చేశా’అని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు. దీంతో తన పేరుతో ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ అయినట్లు అశోక్ గుర్తించాడు. ఫేక్ మెసేజ్​లని నమ్మొద్దని తన ఫ్రెండ్స్​ ను అలర్ట్ చేశాడు.   ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్లను క్రియేట్ చేసి కరోనా వచ్చిందని, మనీ అర్జంట్ అంటూ సైబర్ నేరగాళ్లు ఇతరుల ఫేస్​బుక్​ ఫ్రెండ్స్ లిస్ట్ లోని వారికి మెసేజ్​లు చేస్తున్నారు. వీటిని నమ్మి రెస్పాండ్ అవుతున్న వారు మనీ ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. ఇలా కరోనాను క్యాష్​ చేసుకునేందుకు సైబర్ దొంగలు కొత్త స్కెచ్​లు వేస్తున్నారు.’’
హైదరాబాద్‌,వెలుగు: ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో ట్రాప్ చేసి సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు. గతేడాది పోలీసులు, హై ప్రొఫైల్ అధికారుల పేర్లతో సైబర్ నేరగాళ్లు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెకండ్ వేవ్​ను క్యాష్​ చేసుకునేందుకు ఫేస్ బుక్, మెసెంజర్స్ లో పోస్టింగ్స్ చేసి మోసాలు చేస్తున్నారు. ఇందుకోసం ఇతరుల ఫేక్ బుక్ అకౌంట్స్ ను టార్గెట్ చేశారు. వారి అకౌంట్​లో నుంచి ఫొటోలు, ఫ్రెండ్స్ లిస్ట్ ను కాపీ చేసుకుంటున్నారు. వారి పేర్లతోనే ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసి వారి ఫొటోలనే పెడుతున్నారు. తర్వాత  వారి ఫ్రెండ్స్ లిస్ట్​లోని వారికి ఫేక్​ అకౌంట్​ మెసేజ్ లు పెడుతున్నారు. రిప్లయ్ ఇచ్చిన వారికి తాను కరోనాతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యానని, అర్జెంట్​గా హాస్పిటల్ బిల్, మెడిసిన్స్ కోసం డబ్బులు కావాలని మెసేజ్ చేస్తున్నారు.  ఇలా గ్రూపులోని ప్రతి కాంటాక్ట్​కి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపిస్తున్నారు. ట్రాప్‌లో చిక్కిన వారి నుంచి అందినంతా దోచేస్తున్నారు.

గూగుల్ పే నుంచి ట్రాన్స్ ఫర్ చేయించుకుని..

తమ ట్రాప్ లో చిక్కిన వారికి సైబర్ క్రిమినల్స్ హాస్పిటల్ పేరు, ఏరియా కనిపించకుండా ఫేక్ బిల్స్ ను పంపిస్తున్నారు. రిప్లయ్ ఇచ్చిన వారితో చాటింగ్ చేసి తమ అకౌంట్ పనిచేయడం లేదని చెప్పి గూగుల్ పే, ఫోన్ పే ద్వారా మనీ పంపమని చెప్తున్నారు. ఒకసారి డబ్బులు ట్రాన్స్​ఫర్ చేసిన వారిని తిరిగి మళ్లీ చీటింగ్‌ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మందుల కోసం డబ్బులు కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.   జాంతారా, యూపీ, రాజస్థాన్ కి చెందిన గ్యాంగ్స్ ఇలా ఇతరుల ఫొటోలతో ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాయని సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.  ఫేస్ బుక్ ఫ్రెండ్స్ నుంచి ఎవరైనా మనీ కావాలని మెసేజ్ చేస్తే  వెంటనే  డబ్బులు పంపొదన్నారు.  అతడికి కాల్ చేసి వివరాలు తెలుసుకోవాలన్నారు. ఫేస్ బుక్ ప్రైవసీ సెట్టింగ్స్ లో ప్రొఫైల్ ఫొటోను లాక్ చేసుకోవాలని సూచించారు.