గూగుల్ క్లౌడ్​లో చోరీ చేసిన డేటా

 గూగుల్ క్లౌడ్​లో చోరీ చేసిన డేటా

గచ్చిబౌలి, వెలుగు: డేటా చోరీ కేసులో నిందితులు 80 కోట్ల మంది డేటాను దొంగిలించి, 26 కంపెనీలకు అమ్మేసినట్లు సైబరాబాద్ సిట్ అధికారులు వెల్లడించారు. ఆ డేటాను ఆయా కంపెనీలు అడ్వర్టైజ్ మెంట్లు, మార్కెటింగ్, బల్క్ మెసేజ్ లు పంపేందుకు వాడుకున్నట్లు తెలిపారు. అయితే, డేటా చోరీ కేసులో టెక్నికల్ ఇష్యూస్ ఉండడంతో దర్యాప్తు స్లోగా సాగుతోందని మంగళవారం సిట్ అధికారి కల్మేశ్వర్ తెలిపారు. చోరీ చేసిన డేటాను నిందితులు గూగుల్ క్లౌడ్​లో పెట్టారని తెలిపారు. గూగుల్ ప్రతినిధులకు లెటర్ రాశామని, రిప్లై కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. 21 కంపెనీల ప్రతినిధులను విచారిస్తున్నామని కల్మేశ్వర్ తెలిపారు. నిందితులు బిగ్ బాస్కెట్ కంపెనీ సర్వర్ ను హ్యాక్ చేసి 3 కోట్ల మంది కస్టమర్ల డేటాను చోరీ చేశారని, ఆ డేటాను తమ వెబ్ సైట్ లో అమ్మకానికి పెట్టారన్నారు. ఈ చోరీ విషయాన్ని ఆ కంపెనీ కూడా అంగీకరించిందన్నారు. అలాగే పాలసీబజార్ డేటా కూడా చోరీ అయినట్లు గుర్తించామని, కానీ డేటా లీక్ విషయాన్ని ఆ కంపెనీ ఒప్పుకోలేదన్నారు. అయితే, హ్యాక్ అయిన డేటా రీస్టోర్ అయిందని ఆ కంపెనీలు చెప్పాయన్నారు. హెచ్ డీఎఫ్​ సీ బ్యాంక్ నుంచి 2022, మార్చి 9న కూడా 7.5 జీబీ కస్టమర్ల డేటా లీక్ అయిందని, ఆ విషయాన్ని బ్యాంక్ అధికారులు ఒప్పుకోలేదన్నారు. 

బల్క్ ఎస్ఎంఎస్​లు.. పెద్ద బిజినెస్

చోరీ అయిన డేటాను మొత్తం 26 కంపెనీలు కొనుగోలు చేశాయని, వాటిలో కొన్ని ఎంఎన్ సీ కంపెనీలు కూడా ఉన్నాయని సిట్ చీఫ్ తెలిపారు. ‘‘ఈ డేటాను బల్క్ ఎస్ఎంఎస్ ప్రొవైడర్లు బల్క్ మెసేజ్​లు పంపేందుకు వాడుతున్నారు. బల్క్ ఎస్ఎంఎస్ అనేది పెద్ద బిజినెస్. ఒక్క మెసేజ్​కు 9 నుంచి 14 పైసల వరకు చార్జ్ చేస్తున్నారు” అని ఆయన వెల్లడించారు. ఒక్కో బల్క్ ఎస్ఎంఎస్ ప్రొవైడర్ రోజుకు3 కోట్ల ఎస్ఎంఎస్​లు పంపిస్తున్నారని చెప్పారు. దేశంలో వెయ్యి బల్క్ ఎస్ఎంఎస్ ప్రొవైడర్లకు ట్రాయ్ లైసెన్సు ఇచ్చిందని, కానీ వీటిపై ట్రాయ్ పర్యవేక్షణ లేదన్నారు. అన్ని బ్యాంకులతో థర్డ్ పార్టీ ఏజెన్సీలు అటాచ్ అయి ఉన్నాయని, వీటితో కూడా డేటా మిస్ యూజ్ అవుతోందన్నారు. డేటా చోరీ కేసులో కీలక నిందితుడు వినయ్ భరద్వాజ్ మరో నలుగురికి కూడా డేటాను అమ్మినట్లు గుర్తించామన్నారు. అహ్మదాబాద్​కు చెందిన అనిల్ సోహెన్ అనే వెబ్ డిజైనర్ చోరీ అయిన డేటాను వెబ్​సైట్​లో పెట్టి అమ్మినట్లు తెలిపారు.