ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు

ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు


ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు పాఠశాలలకు మే 01బుధవారం రోజున ఉదయం  బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో మందుగా  అప్రమత్తమైన స్కూల్‌ యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాయి. ముందు జాగ్రత్తగా చర్యగా పాఠశాలలను ఖాళీ చేయించాయి. వెంటనే   సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ బృందం, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని  తనిఖీలు చేస్తున్నారు.

ఇలాంటి బెదిరింపు మెయిల్స్ ఇతర పాఠశాలలకు కూడా వచ్చినట్లుగా పోలీసులు వెల్లడించారు.  ఢిల్లీలోని ద్వారక, చాణక్యపురి, మయూర్‌ విహార్‌, వసంత్‌ కుంజ్‌, సాకేత్‌ స్కూళ్లకు తొలుత ఈ బెదిరింపులు వచ్చాయి.  నోయిడాలోని దాదాపు 50కి పైగా పాఠశాలలకు ఈ-మెయిల్‌ వచ్చినట్లు తెలుస్తోంది.  దీంతో  స్కూల్ పిల్లలను తిరిగి ఇంటికి పంపిస్తున్నట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు.  తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు ఆయా స్కూళ్లకు చేరుకుని పిల్లలను తీసుకెళ్లారు.

 బెదిరింపులకు పాల్పడిన ఈ-మెయిల్‌ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ-మెయిల్ ఐపీ అడ్రస్‌లను బట్టి విదేశాల నుంచి దీన్ని పంపించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.  దాదాపు 2 నెలల క్రితం ఆర్‌కే పురంలోని డీపీఎస్‌లో కూడా ఇలాంటి బెదిరింపు వచ్చింది. ఈ-మెయిల్‌లో బెదిరింపు పంపడంతో వెంటనే పాఠశాలను ఖాళీ చేయించారు.   2023లో సెప్టెంబర్ లో  లాల్ బహదూర్ శాస్త్రి స్కూల్‌లో బాంబు బెదిరింపు బూటకమని తేలింది.