ఇన్​స్పిరేషన్..డాక్టర్‌‌ పెట్టిన కంపెనీ!

ఇన్​స్పిరేషన్..డాక్టర్‌‌ పెట్టిన కంపెనీ!

ఓ ఆయుర్వేద డాక్టర్‌‌ తన పేషెంట్ల కోసం కొన్ని మందులు తయారు చేశాడు. అవి అందరికీ అందాలనే ఉద్దేశంతో ఓ కంపెనీ పెట్టి వాటి ఉత్పత్తి పెంచాడు. అలా మొదలైన డాబర్‌‌ కంపెనీ ప్రయాణం ఇప్పుడు వేల కోట్ల కంపెనీగా ఎదిగే దాకా చేరింది. తరతరాల నుంచి డాక్టర్‌‌ డాబర్‌‌ కుటుంబం కంపెనీని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ప్రజలకు ఆయుర్వేద గుణాలతో నిండిన ప్రొడక్ట్స్‌ అందిస్తోంది. 

కొన్నేండ్ల క్రితం మన దేశంలో పెద్ద గందరగోళం ఏర్పడింది. ప్రజలకు అనేక రకాల అంటువ్యాధులు వచ్చాయి. అప్పుడు మన దగ్గరున్న ఆయుర్వేద వైద్యులు వాళ్లకు తెలిసిన వైద్య విధానాలను ఉపయోగించి చాలామంది ప్రాణాలు కాపాడారు. అలాగే ఆయుర్వేద డాక్టర్‌‌ ఎస్‌కే బర్మన్‌ కలకత్తాలో కొన్ని వేల ప్రాణాలను కాపాడాడు. కలకత్తాలో1800ల్లో కలరా, మలేరియా లాంటి వ్యాధులు అల్లకల్లోలం చేశాయి. అప్పుడు దక్తర్(బెంగాళీలో దక్తర్‌‌ అంటే డాక్టర్ అని అర్థం) బర్మన్ ఆయుర్వేద మందులను ప్రజలకు ఇచ్చి కాపాడాడు. 


తరతరాలుగా గ్రంథాల ద్వారా కాపాడుకుంటూ వస్తున్న పురాతన మూలికా సూత్రీకరణలతో మందులు తయారు చేయడం కోసం అవిశ్రాంతంగా పనిచేశాడు. అతని పూర్వీకులు పంజాబీ ఖత్రీలు. వాళ్లు పంజాబ్ నుండి కోల్‌కతాకు వలస వెళ్లారు. వాళ్ల పూర్వీకుల దగ్గర నేర్చుకున్న వైద్య విధానాలపై బర్మన్‌ అనేక రీసెర్చ్​లు చేశాడు. చివరకు కలరా, మలబద్ధకం, మలేరియా లాంటి వ్యాధులను సహజ పద్ధతుల్లో తగ్గించే మార్గాలను1880ల మధ్యలో కనుగొన్నాడు. ఆయన కనుగొన్న మందులను కలకత్తా, పశ్చిమ బెంగాల్‌లో ప్రజలకు ఇచ్చేవాడు. వాటిని సామాన్యులకు కూడా అందుబాటులో ఉంచేందుకు.. తనను నమ్మిన రోగుల ఇళ్లకు తానే సైకిల్‌పై వెళ్లి మందులు ఇచ్చేవాడు. అందుకోసం ప్రత్యేకంగా లైసెన్స్‌ కూడా తీసుకున్నాడు. ఎంతో మంది పేదలకు రోగాల నుంచి ఉపశమనం కలిగించాడు. 
అయితే, అతను ఒంటరిగా కొన్ని ప్రాంతాలకు మాత్రమే వెళ్లగలిగాడు.

కానీ.. మరెన్నో ప్రాంతాల్లో ప్రజలు వ్యాధులతో బాధపడుతున్నారు. వాళ్లందరి దగ్గరికి సైకిల్‌పై వెళ్లి మందులు ఇవ్వడం సాధ్యం కాదు. అందుకే మారుమూల గ్రామాలు, పట్టణాల్లో రోగులకు కూడా తన మందులను అందుబాటులో ఉంచాలి అనుకున్నాడు. అందుకోసం డాక్టర్ బర్మన్ ఒక పరిష్కారం కనుగొన్నాడు. అదేంటంటే.. మెయిల్ ఆర్డర్ ద్వారా మందులు పంపించడం. ఇది కొన్ని రోజుల్లోనే ఫుల్‌ సక్సెస్‌ అయ్యింది. దాంతో అతని పేరు ప్రజల్లో మార్మోగిపోయింది. కానీ.. ఆయన పేరును పలకలేని వాళ్లు డాక్టర్‌‌లో నుంచి ‘డా’ తన పేరు బర్మన్‌ నుంచి ‘బర్‌‌’ తీసుకుని ‘డాబర్‌‌’ పేరుతో పిలిచేవాళ్లు. అతను ఇచ్చే మెడిసిన్‌ను డాబర్‌‌ మందులు అనేవాళ్లు. 

కంపెనీ ఏర్పాటు 

కొన్ని సంవత్సరాల్లోనే బర్మన్‌ మందులకు బాగా డిమాండ్‌ పెరిగింది. విపరీతంగా ఆర్డర్లు రావడం మొదలైంది. దాంతో తాను తయారు చేసిన ప్రొడక్ట్స్‌ ఉత్పత్తి చేయడానికి ఒక కంపెనీ పెట్టాలనే ఆలోచన వచ్చింది. 884లో కంపెనీని స్థాపించి, దానికి ‘డాబర్‌‌’ అని పేరు పెట్టాడు. మందులకు బాగా డిమాండ్ పెరగడంతో ప్రతి సంవత్సరం ప్రొడక్షన్‌ కూడా పెరుగుతూ వచ్చింది. 

రీసెర్చ్ విభాగం

ఈ కంపెనీ1986లో డాబర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది.  ఆ తర్వాత దాన్నే డాబర్ ఇండియా లిమిటెడ్‌గా మార్చారు. కంపెనీ పెట్టిన మూడు దశాబ్దాల తర్వాత 1919లో అతని కొడుకు సీఎల్‌ బర్మన్ ఆయుర్వేద మందుల కోసం రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగాన్ని ఏర్పాటు చేశాడు. ఉత్పత్తిని పెంచడానికి యాంత్రీకరణను ప్రవేశపెట్టాడు. దాంతో వ్యాపారం బాగా పెరిగింది. కంపెనీ ప్రజాదరణ కూడా పొందింది.
కాలం గడిచేకొద్దీ సీఎల్‌ బర్మన్ కొడుకులు పురాన్, రతన్ చంద్ కంపెనీ  బాధ్యతలు తీసుకున్నారు. పురాన్ ప్రొడక్షన్‌ చూసుకోగా, రతన్ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌పై దృష్టి పెట్టాడు. ఉసిరి కలిపిన హెయిర్ ఆయిల్‌ను 1940ల్లో ప్రొడ్యూస్‌ చేయడం మొదలుపెట్టింది డాబర్. ఆ ఆయిల్‌ ఇండియాలోనే నెంబర్‌‌ వన్ బ్రాండ్‌గా నిలిచింది. ఆ తర్వాత బర్మన్ కుటుంబం ఆస్తులు పెరిగాయి. కుటుంబ సభ్యులంతా కలసి కంపెనీని చూసుకుంటున్నారు. 

ఢిల్లీకి 

అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో కలకత్తాలో పరిస్థితులు మారిపోయాయి.1960ల చివర్లో, 1970ల్లో అక్కడ రాజకీయ, సామాజిక అశాంతి నెలకొంది. నక్సలైట్ ఉద్యమం, కార్మిక సంఘాల నుంచి ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దాంతో బిర్లా గ్రూప్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా తమ అనేక కంపెనీల మెయిన్ బ్రాంచ్‌లను కలకత్తా నుండి తరలించాయి. దాంతో బర్మన్ కుటుంబం కూడా 1972లో డాబర్ మెయిన్‌ బ్రాంచీని న్యూఢిల్లీకి మార్చారు. 1998 నాటికి డాబర్‌‌.. బర్మన్ కుటుంబంలోని నాల్గవ, ఐదవ తరాల చేతిలోకి వచ్చింది. వీళ్లు హెయిర్ ఆయిల్స్, టూత్‌పేస్ట్​లపై ఎక్కువ ఫోకస్‌ పెట్టారు. వ్యాపారం మళ్లీ పెరిగింది. 

అనేక ఉత్పత్తులు 

ఇండియాలోని ఎఫ్ఎంసీజీ అనేది నాల్గవ అతిపెద్ద వ్యాపార రంగం. ‘ఎఫ్ఎంసీజీ’ అంటే ఫాస్ట్ -మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. ఈ విభాగంలోని కంపెనీలు ఫుడ్‌, స్నాక్స్, డ్రింక్స్‌,  హోం నీడ్స్‌, బ్యూటీ ప్రొడక్ట్స్‌, క్లోతింగ్‌ లాంటివి ఉత్పత్తి చేస్తాయి. ఇవన్నీ మనం డైలీ వాడే వస్తువులు. ఇండియాలో ఇలాంటి వస్తువులు ఉత్పత్తి చేస్తున్న అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ కంపెనీల్లో డాబర్​ది నాలుగో స్థానం. కేవలం ఆయుర్వేద మందుల ప్రొడక్షన్‌తో మొదలైన కంపెనీ ఇప్పుడు వంటనూనె, తేనె, బిస్కెట్లు, స్నాక్స్‌, టూత్‌పేస్ట్‌ లాంటి అనేక ప్రొడక్ట్స్​ని మార్కెట్‌లోకి తెచ్చింది.  

120 దేశాల్లో ...

ఈ బ్రాండ్ నుంచి ఫుడ్‌, హెల్త్ కేర్‌‌, స్కిన్‌, ఓరల్‌ కేర్‌‌ ప్రొడక్ట్స్​తో 67 లక్షల అవుట్‌లెట్‌లను నడుపుతోంది. వీళ్ల అవుట్‌లెట్లు పట్టణాల్లో 60 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 40 శాతం ఉన్నాయి. డాబర్ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో ఉన్నాయి. ముఖ్యంగా సార్క్ దేశాలు, ఆఫ్రికా, అమెరికా, యూరోప్, రష్యాలో ఎక్కువ అమ్ముడవుతున్నాయి. డాబర్ మొత్తం ఆదాయంలో 27 శాతానికి పైగా విదేశాల నుంచే వస్తోంది. ఒకప్పుడు ఒకే ఒక తయారీ కర్మాగారం ఉండేది. ఇప్పుడు డాబర్‌‌కు మొత్తం 12 మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్లు ఉన్నాయి. అందులో ఎనిమిది ఇండియాలో ఉంటే నాలుగు విదేశాల్లో ఉన్నాయి. డాబర్ నుంచి మొత్తంగా 250కి పైగా ప్రొడక్ట్స్‌ ఉత్పత్తి అవుతున్నాయి. దుబాయ్, ఈజిప్ట్, నైజీరియా, బంగ్లాదేశ్, యునైటెడ్ స్టేట్స్, లండన్, నేపాల్‌లో బ్రాంచీలు ఉన్నాయి. 

బాద్‌షా

బాద్‌షా మసాలా కంపెనీలో 51శాతం షేర్లను కొని డాబర్ కంపెనీ మసాలా మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఎక్కువశాతం కొనడంతో జనవరి 2, 2023 నుండి బాద్‌షా మసాలా ప్రైవేట్ లిమిటెడ్ డాబర్‌‌కు అనుబంధ కంపెనీగా మారింది.