దుమ్ములేపిన దలాల్‌‌ స్ట్రీట్

దుమ్ములేపిన దలాల్‌‌ స్ట్రీట్

    పన్నుల రద్దుపై ఆశలతో

    సెన్సెక్స్ 582 పాయింట్లు జూమ్

    రోజంతా కొనుగోళ్ల సందడి

    కార్పొరేట్లకు మరిన్ని తాయిలాలపై ప్రభుత్వం కసరత్తు!

ముంబై: మంగళవారం స్టాక్‌‌మార్కెట్‌‌ దుమ్ములేపింది.  బెంచ్‌‌మార్క్ సెన్సెక్స్ 582 పాయింట్ల మేర దూసుకుపోయి, నాలుగు నెలల గరిష్టానికి ఎగిసింది. కార్పొరేట్‌‌ రంగానికి ప్రభుత్వం మరిన్ని శుభవార్తలు ప్రకటించనుందనే వార్తలతో సంవత్ 2076 తొలి సెషన్‌‌ బుల్లిష్ నోట్‌‌తో ప్రారంభమైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌‌666 పాయింట్లకు పైగా లాభపడి.. చివరికి 581.64 పాయింట్ల లాభంతో 39,831.84 వద్ద క్లోజైంది. నిఫ్టీ 159.70 పాయింట్లు ర్యాలీ చేసి 11,786.85 వద్ద ముగించింది.  డివిడెండ్‌‌ డిస్ట్రిబ్యూషన్‌‌ ట్యాక్స్‌‌ (డీడీటీ) రద్దు సహా, లాంగ్‌‌ టర్మ్‌‌– షార్ట్‌‌ టర్మ్‌‌ క్యాపిటల్‌‌ గెయిన్స్‌‌ శ్లాబుల మార్పు, సెక్యూరిటీస్‌‌ ట్రాన్సాక్షన్‌‌ ట్యాక్స్‌‌ (ఎస్‌‌టీటీ) ఎత్తివేసే ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)లు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలపై పలు దఫాలు మీటింగ్స్‌‌ జరిగినట్లు తెలుస్తోంది.

ఈ వార్తలతో రోజంతా మార్కెట్‌‌లో కొనుగోళ్ల సందడి కనిపించింది. మరోవైపు కార్పొరేట్ కంపెనీల క్వార్టర్ ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. టాటా మోటార్స్‌‌ క్యూ2 ఫలితాలు బాగుండటంతో ఆ కంపెనీ స్టాక్ 17 శాతం మేర పెరిగింది. టాటా సన్స్‌‌ స్టాక్‌‌తో పాటు టాటా స్టీల్,యెస్‌‌ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకి, టెక్ మహింద్రా, టీసీఎస్ షేర్లు లాభాలు పండించాయి. అంబానీ ఆన్‌‌లైన్‌‌లోకి ప్రవేశించనున్నట్టు ప్రకటించగానే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కూడా మంగళవారం మార్కెట్‌‌లో పరుగులు పెట్టాయి.   లాంగ్‌‌ టర్మ్‌‌ క్యాపిటల్‌‌ గెయిన్స్‌‌ను 2018 బడ్జెట్‌‌లో ప్రవేశపెట్టారు. దీనికింద 10 శాతం పన్ను విధిస్తున్నారు. ఇప్పుడు దీనిని రివ్యూ చేసి, నిర్ధారిత కాలం తర్వాత ఈ పన్ను లేకుండా చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఇక ఈక్విటీలపై ఏడాదిలోపు వచ్చే లాభంపై  15 శాతాన్ని షార్ట్‌‌ టర్మ్‌‌ క్యాపిటల్‌‌ గెయిన్స్‌‌గా విధిస్తున్నారు. షేర్ల కొనుగోలు, అమ్మకంపై సెక్యూరిటీస్‌‌ ట్రాన్సాక్షన్‌‌ ట్యాక్స్ (ఎస్‌‌టీటీ) విధిస్తున్నారు. ఎస్‌‌టీటీని ఎత్తివేయాలని మార్కెట్‌‌ వర్గాలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి కూడా. కానీ, భారీగా డబ్బులు వస్తుండటంతో ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎస్‌‌టీటీని 2004 లో ప్రవేశ పెట్టారు.

రూ.2.73 లక్షల కోట్లు పెరిగిన సంపద

స్టాక్ మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద కూడా అలానే పెరిగింది. మంగళవారం ఇన్వెస్టర్ల సంపద రూ.2.73 లక్షల కోట్లు పెరిగి రూ.1,52,04,693.34 కోట్లకు చేరుకుంది. పెద్ద కార్పొరేట్ కంపెనీల క్యూ2 ఫలితాలు స్ట్రాంగ్‌‌గా ఉండటంతో మార్కెట్‌‌లో కొనుగోళ్ల సందడి కనిపించిందని, మిడ్, స్మాల్ క్యాప్స్‌‌ ఆకర్షణీయమైన వాల్యుయేషన్‌‌తో ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు.