వర్షాల వల్ల 60 వేల కుటుంబాలు రోడ్డున పడ్డయ్

వర్షాల వల్ల 60 వేల కుటుంబాలు రోడ్డున పడ్డయ్

హైదరాబాద్, వెలుగు: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పేద, అట్టడుగు వర్గాల జనాలే అధికంగా నష్టపోయారని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ అన్నారు. రాజకీయ నాయకుల స్వార్థం వల్ల 60 వేల మంది కట్టుబట్టలతో రోడ్డున పడాల్సి వచ్చిందని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

హైదరాబాద్ , వరంగల్ సిటీల్లో ప్రభుత్వ మిత్రుల భారీ వెంచర్లు, ఎమ్మెల్యేల అక్రమ నిర్మాణాలు, అధికారుల బాధ్యతా రాహిత్యం వల్ల నాలాలు, చెరువులు, పరివాహక ప్రాంతాలు కబ్జాలకు గురై మునుగుతున్నాయన్నారు. ఇదేనా ప్రజలు కోరుకున్న బంగారు తెలంగాణ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వరదల్లో మునిగిన వరంగల్ నగరాన్ని శనివారం తాము సందర్శించి బాధితులను తమ వంతుగా ఆదుకుంటామన్నారు. ప్రభుత్వం పేదలకు అందించాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నేటికీ పేదలకు పంచక పోవడం వల్లనే అర్హులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన ఆరోపించారు.