రోడ్డుపై గుంతలున్నాయా? గుంతల్లో రోడ్డు ఉందా?

రోడ్డుపై గుంతలున్నాయా? గుంతల్లో రోడ్డు ఉందా?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. బుధవారం నిర్వహించిన ప్రచార సభలో హోం మంత్రి అమిత్ షా.. ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించడంలో కేజ్రీవాల్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. గాలి, నీరు విషమయమై పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌కు ధైర్యముంటే యమునా నదిలో చొక్కా విప్పేసి మునగాలంటూ సవాలు విసిరారు. ఆయన ఆ పని చేస్తే నది ఎంతగా కాలుష్యమైందో అర్థమవుతుందన్నారు అమిత్ షా. ఆయన ఈ సవాల్ స్వీకరించలేరని, ఒకవేళ అలా చేయగలిగితే యమునా నది క్లీన్‌గా ఉందని నమ్ముతామని అన్నారు. కేజ్రీవాల్ అసమర్థత వల్లే ఢిల్లీ కాలుష్యంలో మగ్గుతోందని ఆరోపించారు. గాలిని ప్యూరిఫై చేస్తామని గతంలో హమీ ఇచ్చారని, కానీ అందులోనూ విఫలమయ్యారని అన్నారు. సీఎం బాధ్యతారాహిత్యం వల్లే ఢిల్లీలో తాగునీరు, పీల్చే గాలి విషమైపోయాయని ఆరోపించారు.

ఢిల్లీ రోడ్లను యూరప్‌ రోడ్ల లాగా మారుస్తామని కేజ్రీవాల్ హామీ ఇవ్వడంపైనా అమిత్ షా స్పందించారు. తాను పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని, ఎక్కడ చూసినా రోడ్లు గుంతలమయమై కనిపిస్తున్నాయని అన్నారు. రోడ్లపై గుంతలు ఉన్నాయో, గుంతల్లో రోడ్లు ఉందో అర్థం కావడం లేదన్నారు. ఫిబ్రవరి 8న జరగబోయే ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి గెలిపించాలని ఢిల్లీ ప్రజలను కోరారు. అభివృద్ధి నిరోధకులను ఓడించాలని చెప్పారు అమిత్ షా. సీఏఏకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు హింసను రెచ్చగొడుతున్నాయన్నారు. కొత్త చట్టం వల్ల భారతీయులకు నష్టమని నిరూపించాలని సవాలు విసిరారు అమిత్ షా. ఎవరైనా సరే బీజేపీని తిడితే పడతామని, భారత మాతకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తే కటకటాల వెనక్కి పంపిస్తామని హెచ్చరించారు.