పొగమంచు ఎఫెక్ట్..150 ఫ్లైట్స్ ఆలస్యం..250 రైళ్లు రద్దు

పొగమంచు ఎఫెక్ట్..150 ఫ్లైట్స్ ఆలస్యం..250 రైళ్లు రద్దు

ఉత్తరాదిని ఓ వైపు పొగమంచు, చలి వణికిస్తోంది. ఢిల్లీతో పాటు యూపీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో రోజు రోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  దీంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఒకవైపు చలి మరోవైపు పొగ మంచుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  గడ్డ కట్టేంత ఉష్ణోగ్రతలతో విలవిల్లాడుతున్నారు.  దట్టమైన పొగమంచు కారణంగా ఇవాళ 150 విమానాలు ఆలస్యంగా రానుండగా... 250 రైళ్లు రద్దయ్యాయి. 

ఢిల్లీలో ఇవాళ కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి.  తీవ్రమైన చలి, దట్టమైన పొగమంచు కారణంగా ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. సఫ్తార్‌జంగ్‌ ప్రాంతంలో అత్యల్పంగా 1.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

చలితో పాటు పొగమంచు కూడా పెరుగుతుండటంతో ఢిల్లీ, పంజాబ్, హర్యానాల్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో పాటు రాజస్థాన్, బీహార్‌లకు ఆరెంజ్ అలర్ట్ ను ఐఎండీ ప్రకటించింది. దీంతో అలర్ట్ అయిన ఢిల్లీ ప్రభుత్వం..జనవరి 15 వరకు పాఠశాలలను మూసి వేయాలని విద్యాశాఖను ఆదేశించింది.  ఢిల్లీలో ఇప్పటికే  ప్రైవేట్ స్కూళ్లు శీతాకాల సెలవులు ఇచ్చారు.