చెరువులో అక్రమ నిర్మాణాలు.. కూల్చివేసిన రెవెన్యూ అధికారులు

చెరువులో అక్రమ నిర్మాణాలు.. కూల్చివేసిన రెవెన్యూ అధికారులు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా జులిపించారు. శివరాంపల్లిలోని సర్వే నెంబర్ 116 లోని సులేమాన్ చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను మే 5వ తేదీ శుక్రవారం అధికారులు కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ తహసిల్దార్ చంద్రశేఖర్ గౌడ్ హెచ్చరించారు. సులేమాన్ చెరువులో ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే సరిహద్దులను ఏర్పాటు చేశారు. అయితే కొందరు వ్యక్తులు సరిహద్దులను చెరిపి నిర్మాణాలు చేపడుతున్నట్లు ఫిర్యాదు వచ్చింది అన్నారు. 

స్థానికుల ఫిర్యాదు మేరకు అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరిగిందన్నారు చంద్రశేఖర్ గౌడ్. సర్వేనెంబర్ 116 పరిధిలోగల భూమి ప్రైవేట్ వ్యక్తులకు చెందినప్పటికీ.. నిబంధనల ప్రకారం ఎఫ్టిఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలను చేపట్టరాదని తహసిల్దార్ తెలిపారు. ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న భూమి ఎవరిది.. నిర్మాణాలు ఎవరు చేపడుతున్నారు అనే విషయమై విచారణ చేస్తున్నట్లు తహసిల్దార్ వెల్లడించారు.