రెచ్చగొడితే యుద్ధమే..ఇరాన్ పై అమెరికా దండయాత్ర : ట్రంప్

రెచ్చగొడితే యుద్ధమే..ఇరాన్ పై అమెరికా దండయాత్ర : ట్రంప్

పుట్టలో వేలెడితే కుట్టడం సహజం. అమెరికాకి ఆ అవసరం లేదు. కుట్టాలనుకుంటే ఏదో ఒక కారణం వెతుక్కుంటుంది. ప్రస్తుతం ఇరాన్​ విషయంలో అదే జరుగుతోంది. ఇరాన్​లో పవర్​ఫుల్​ కమాండర్​ ఖాసిం సులేమానీని చంపేసిన తర్వాత… ఆ దేశంపైకి దండయాత్రకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అంతర్జాతీయంగా బోనులో నిలబడాల్సిన డొనాల్డ్​ ట్రంప్​ ఎదురు తిరుగుతున్నారు. సులేమానీ హత్యకు ప్రతీకారానికి పాల్పడితే జరగబోయేది యుద్ధమేనని సిగ్నల్స్​ ఇస్తున్నారు. ప్రపంచం నలుమూలలాగల తన సైనిక స్థావరాల్ని అలర్ట్​ చేశారు. ఎయిర్​ బేస్​లు, నావల్​ బేస్​లు, పోర్టులు, ఆర్మీ స్టేషన్లలో స్టాండ్​బైగా ఉన్న ట్రూప్స్​ని రెడీ చేస్తున్నారు. గల్ఫ్​ ప్రాంతానికి అదనంగా 3,500 మందిని పంపుతున్నట్లుగా అమెరికా డిఫెన్స్​ హెడ్​క్వార్టర్స్​ పెంటగాన్​ ప్రకటించింది. ఇప్పటికే చాలా దేశాల్లో వేలాది అమెరికా సైనికులున్నారు. అయితే, కచ్చితమైన సంఖ్య తెలీదు.

అఫ్ఘాన్​లో 14,000

ప్రపంచంలోనే అఫ్ఘానిస్థాన్​ను చాలా స్ట్రాటజిక్​ పాయింట్​గా చెబుతారు. అక్కడ 14,000 మంది అమెరికా సైనికులున్నారు. ట్విన్​ టవర్స్​ని 2001లో విమానాలతో కూల్చేసిన తర్వాత అఫ్ఘానిస్థాన్​లోని బగ్రామ్​లో అమెరికా ఎయిర్​బేస్​ ఏర్పాటు చేసింది. అడ్వాన్స్​డ్​ వార్​ జెట్​లు దిగడానికి వీలుగా దీనిని డెవలప్​ చేశారు. ఈ ఎయిర్​ బేస్​ నుంచి ఆసియా, ఆఫ్రికాల్లో ఏ మూలకు వెళ్లాలన్నా సమాన దూరం ఉంటుందని అంచనా. పోయిన నవంబర్​లో అక్కడికి ట్రంప్​ ఆకస్మికంగా వెళ్లినప్పుడే డిఫెన్స్​ ఎనలిస్టులు అనుమానించారు.

ఇరాక్​​లో 6,000

ఇక్కడ 6,000 మంది అమెరికా సైనికులున్నట్లు అంచనా. బాగ్దాద్​ చేరువలోని గ్రీన్​ జోన్​లో వీళ్లున్నారు. అమెరికా–ఇరాన్​ల తగాదా మధ్య ఇరాక్​ చిక్కుకుపోయింది. అక్కడున్న తమ సిబ్బందిని, అమెరికన్లను వెనక్కి వచ్చేయమని అమెరికా విదేశాంగ శాఖ ఆదేశించింది. గ్రీన్​ జోన్​పైనా, బలాడ్​ ఎయిర్​ బేస్​పైనా రాకెట్ల దాడులు జరిగాయి. ఎవరికీ గాయాలు కాకపోయినా అమెరికా స్ఠావరాలపై రాకెట్లు పడడమనేది చాలా పెద్ద విషయం.

కువైట్​లో 13,000

ఇక్కడ చాలా అమెరికా బేస్​ స్టేషన్లున్నాయి. వాటిలో 13,000 మంది వరకు సైనికులుంటారని అంచనా. 1991లో గల్ఫ్​ యుద్ధం జరిగాక అమెరికా–కువైట్​ల మధ్య డిఫెన్స్​ సహకార ఒప్పందం కుదిరింది.

ఎమిరేట్స్​లో 5,000

హొర్ముజ్​కి సంబంధం ఉన్న మరో దేశం యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​. ఇది సౌదీ, అమెరికాలతో చాలా స్నేహంగా ఉంటుంది. అక్కడ 5,000 మంది వరకు అమెరికా ట్రూప్స్​ ఉన్నాయి. అయితే, ఇటీవల ఇరాన్​–అమెరికాల తగాదాల్లో తలదూర్చకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

సిరియాలో 2,000

సుమారుగా 2,000 మంది వరకు అమెరికా సైనికులు సిరియాలో ఉండేవారు. పోయినేడాది అక్టోబరులో సైన్యాన్ని ట్రంప్​ వెనక్కి వచ్చేయమనడంతో ప్రస్తుతం నామమాత్రంగా 800 వరకు ఉంటారని అంచనా. వీళ్లుకూడా సిరియా–జోర్డాన్​ సరిహద్దుల్లో ఉంటారు. ఆ ప్రాంతంలో ఇరాన్​ సపోర్టు చేస్తున్న గ్రూప్​లు చాలా యాక్టివ్​గా ఉంటాయి.

ఖతార్​​లో 13,000

ఈ దేశానిది చిత్రమైన వైఖరి. దీనికి అమెరికా మిత్రదేశాలైన సౌదీ అరేబియా, ఎమిరేట్స్​లతో పడదు.  పశ్చిమాసియాలోని అతి పెద్ద అమెరికా మిలిటరీ బేస్​ ఖతార్​లోనే ఉంది. అక్కడ సుమారుగా 13,000 మంది అమెరికా సైనికులుంటారని అంచనా. దీనిని డెవలప్​ చేయడానికి ఖతార్​ 108 కోట్ల డాలర్ల సాయాన్నికూడా ప్రకటించింది.

బహ్రెయిన్​లో 7,000

అమెరికా నేవీ బేస్​ బహ్రెయిన్​లో ఏర్పాటు చేసుకుంది. అక్కడ 7,000 మంది సిబ్బంది ఉంటారని అంచనా. సౌదీకి భౌగోళికంగానూ, సంబంధాల పరంగానూ చాలా దగ్గరగా ఉన్న దేశం బహ్రెయిన్​. ఇరాన్​పై దాడి చేయాలన్న ట్రంప్​ నిర్ణయాన్ని ఫుల్​ సపోర్టు చేస్తోంది. 2011లో ఇరాన్​ మద్దతున్న షియాలను
అణచివేసింది.

సౌదీలో 3,000

ఇరాన్​తో సౌదీ అరేబియాకి చాలాకాలంగా పడడం లేదు. యెమన్​లో ఈ రెండూ ఇతరులద్వారా యుద్ధం (ప్రాక్సీ వార్​) జరుపుతున్నాయి. గల్ఫ్​లో సౌదీ అరేబియా అమెరికాకి నమ్మినబంటులా ఉంది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో 3,000 మంది అమెరికా సైనికులున్నారు. అక్టోబరులోనే అక్కడికి అదనపు బలగాల్ని పంపాలని అమెరికా నిర్ణయించింది. నవంబర్​లో సౌదీఅరేబియాలోని చమురు, గ్యాస్​ కేంద్రాలపై దాడులు జరిగినప్పుడు ఆ నెపాన్ని అమెరికా ఇరాన్​పై నెట్టింది. ఇరాన్​కూడా తనకు దీంతో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది.