డబుల్ ఇండ్ల పేరు భారీ మోసం.. లక్షలు దండుకున్న దళారులు

డబుల్ ఇండ్ల పేరు భారీ మోసం.. లక్షలు దండుకున్న దళారులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం పథకం నత్తనడకన సాగుతుండడం దళారులకు అది ఒక వరంగా మారింది. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామంటూ అమాయక ప్రజల నుండి దళారులు లక్షల రూపాయలను వసూలు చేసుకుంటున్నారు. అందుకుగాను దళారులు ప్రజాప్రతినిధులు వారి పీఏల పేర్లను యధేచ్ఛగా వాడుకుంటున్నారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ పాండురంగ నగర్ లో డబుల్ బెడ్రూం ఇండ్ల ఇస్తానంటూ ఓ యువకుడు ఎనిమిది మంది దగ్గర లక్షల రూపాయలను (లక్ష అరవై వేల నుండి 3 లక్షల రూపాయల వరకు ఒక్కొక్కరి దగ్గర) వసూలు చేశాడు.

అయితే డబుల్ బెడ్రూం కోసం లక్షల రూపాయలు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ఇండ్లు రాకపోవటంతో మోసపోయినట్టుగా బాధితులు గుర్తించారు. దీంతో డబ్బులు తీసుకున్న నిందితున్ని నిలదీశారు. స్పందన లేకపోవడంతో బాధితులు అత్తాపూర్ పోలీసులను ఆశ్రయించారు. అత్తాపూర్ పాండురంగ నగర్ చెందిన రవి తాను సాఫ్ వేర్ ఉద్యోగినని చెప్పుకుంటున్నప్పటికీ స్థానికంగా మెడికల్ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుంటాడని సమాచారం. కాగా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న బాధితులు శ్రీనివాస్, గోపాల్, ప్రసన్న కుమార్, కిషోర్ కుమార్ తోపాటు మరికొందరితో సహవాసం చేస్తూ వారికి డబుల్ బెడ్రూం ఇండ్లను ఇప్పిస్తానంటూ నమ్మించాడు.

అందుకుగాను స్థానిక ఎమ్మెల్యే పేరుకు చెందిన లెటర్ ప్యాడ్ ను తయారు చేయడంతో పాటు ఎమ్మెల్యే పీఏ అయిన రఘుతో తనకు సాన్నిహిత్యం ఉందని వారికి నమ్మబలికాడు. డబుల్ బెడ్రూం వస్తుందన్న ఆశతో బాధితులు బంగారం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి లక్షల రూపాయలను నిందితుడికి ఇచ్చారు. డబ్బులు ఇచ్చి ఏళ్ళు గడుస్తున్నా డబుల్ డబుల్ బెడ్రూం రాకపోవడంతో నిందితుడిని నిలదీశారు. నిందితుడి నుండి సరైన సమాధానం రాకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.